AP

వైసీపీ ఐదో జాబితా విడుదలకు కసరత్తు..

ఏపీలో వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఐదో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాల్ని విడుదల చేసిన వైసీపీ.. ఇప్పుడు ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల్ని పిలిపించి చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

 

ఇప్పటికే వైసీపీ ప్రకటించిన నాలుగు జాబితాల్లో కలిపి 10 మంది ఎంపీలు, 58 మంది ఎమ్మెల్యేల స్ధానాల్లో మార్పులు జరిగాయి. మరికొన్ని జాబితాలు త్వరలో ప్రకటిస్తామని ఇప్పటికే వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపులు వస్తూనే ఉన్నాయి. ఈ కసరత్తు పూర్తవడానికి కనీసం రెండు రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. ఇవాళ సీఎంను కలిసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీటు కోల్పోయారు. అలాగే కాటసాని రాంభూపాల్ రెడ్డిని కూడా తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

 

అలాగే ఎంపీల్లో నంద్యాల, గుంటూరు, నరసరావుపేటతో పాటు పలు సీట్లలో మార్పులు చేర్పులకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈసారి ప్రకటించే ఐదో జాబితాలో కనీసం నలుగురైదుగురు ఎంపీలు ఉంటారని తెలుస్తోంది. వీరి స్ధానాల్లో ఎమ్మెల్యేలను పంపడం లేదా కొత్త అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఇప్పటికే ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీటు కోల్పోయిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ను పెందుర్తి లేదా అనకాపల్లి ఎంపీ సీటులో పోటీ చేయించే అవకాశం ఉంది.

 

నంద్యాల ఎంపీ సీటులో పోచ బ్రహ్మానందరెడ్డికి బదులుగా ముస్లిం అభ్యర్ధిని ఎంచుకోనున్నారు. అయితే ఇక్కడ నటుడు అలీకి అవకాశం ఇస్తున్నా ఆయన ముందుకు రాకపోవడంతో వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ఖాదర్ బాషాకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. దీంతో పాటు మరికొన్ని సీట్లు కలిపి రేపు రాత్రికి లేదా ఎల్లుండి ఐదో జాబితా వెలువడే అవకాశముంది.