National

అయోధ్య బాల రాముడు.. విగ్రహం ఫొటోలు విడుదల…

అయోధ్యలో ఈ నెల 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆలయంలో పూజలు, యాగాలు, క్రతువులు కొనసాగుతున్నాయి. బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు సమయం దగ్గరపడుతుండటంతో ఆ మహా ఘట్టానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పరిశీలిస్తోంది.

 

ఈ క్రమంలోనే మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరుకుంది. పూజలు, మంత్రాల మధ్య రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. అయితే గర్భగుడిలో ఉన్న బాల రాముడి విగ్రహానికి చెందిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

 

భిజేపీ సీనియర్‌ నేత ప్రకాశ్‌ జావడేకర్‌ X(ట్విటర్‌)లో ఈ ఫొటోను పంచుకున్నారు. ఫోటోలో 51 అంగుళాల పొడవు ఉన్న బాలరాముడి విగ్రహానికి కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో అయోధ్యలో దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి ఈ నెల 16న నుంచే కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. అయితే 22న అత్యంత ముఖ్యమైన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

 

ముందుగా ప్రధాని మోదీ రాముడి విగ్రహానికి ఉన్న కళ్లకు గంతలు విప్పి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం బలరాముడి విగ్రహానికి హారతి ఇస్తారు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు మరో నలుగురు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మాత్రమే గర్భగుడిలో ఉంటారని ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.

 

రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ బాలరాముడి విగ్రహ రూపురేఖలు ఎలా ఉంటాయో మీడియాకు వెల్లడించారు. దైవత్వం ఉట్టిపడుతున్న విగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుందని తెలిపారు. ఇక ప్రాణ ప్రతిష్ఠ రోజు సామాన్య భక్తులకు అనుమతి లేదని.. జనవరి 23 నుంచి అందరికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించనున్నారు.