ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుండి తెలంగాణా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారని సమాచారం. అయితే ఈసారి తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న బడ్జెట్ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అది రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేయనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలలో మౌలిక సదుపాయాల కల్పనకు 10 కోట్ల రూపాయలు కేటాయించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తును కూడా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పూర్తి చేసినట్టు సమాచారం. మొత్తం 119 నియోజకవర్గాలకు 1190 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఇంత పెద్ద మొత్తంలో అన్ని నియోజకవర్గాలకు ఎప్పుడు బడ్జెట్లో నిధులను కేటాయించలేదు. అయితే తొందరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మాత్రం రేవంత్ తన మార్కును చూపించనున్నారు. ఇక ఈ కేటాయింపులను ప్రత్యేకంగా చూపించాలని రేవంత్ అధికారులను కూడా ఆదేశించారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా విద్యారంగ అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు, తాగునీటి సౌకర్య కల్పనకు కోటి రూపాయలను కేటాయించాలని మార్గదర్శకాలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అలాగే కలెక్టరేట్ భవనాల నిర్వహణకు 50 లక్షలు, మిగిలిన మొత్తాన్ని నియోజకవర్గాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రోడ్లు వేయడం, డ్రైనేజీలు నిర్మించడం, రోడ్లు మరమ్మత్తులు చేయడం, విద్యుత్ లైన్లు వేయించడం తదితర సదుపాయాల కల్పనకు కేటాయించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టినప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో రేవంత్ రెడ్డి ఈ నెల నాలుగవ తేదీన మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు.