TELANGANA

బీఆర్ఎస్ ఓటమి కూడా మంచికే – కేటీఆర్..!!

తెలంగాణ అధికార కాంగ్రెస్..బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ రెండు పార్టీలు తమ పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి బీఆర్ఎస్ కు అవకాశం లేకుండా చేయాలనేది కాంగ్రెస్ లక్ష్యం. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవటం ద్వారా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలనేది కేసీఆర్ వ్యూహం. ఈ క్రమంలోనే ఎన్నికలకు సిద్దం అవుతూనే ఒక పార్టీని మరో పార్టీ ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

 

కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ ను ఓడించటం ఖాయమని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ మంచికే జరిగిందంటూ కేటీఆర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఉప్పల్ నియోజకవర్గం పార్టీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ప్రజలు అర్దమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల సర్కార్ అని, చేతల ప్రభుత్వం కాదని ప్రజలు గుర్తించారన్నారు.

 

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేయకపోతే బొంద పెట్టుడు గ్యారంటీ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడే భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేసారు. చిన్న, పెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రేవంత్ లాగా తాము కూడా తిట్టగలమని చెప్పారు. కానీ, తమకు సభ్యత ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీ మంచికే వచ్చాయనేది తన అభిప్రాయంగా కేటీఆర్ వెల్లడించారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని వివరించారు. ఇలా అయినా కాంగ్రెస్ పాలన గురించి ప్రజలకు తెలుస్తుందని కేటీఆర్ ఆసక్తికర విశ్లేషణ చేసారు