TELANGANA

రేవంత్ Vs కేసీఆర్, సభా సమరం..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించనున్నారు. కాగా.. 10వ తేదీన ప్రభుత్వం శాసనసభలో ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. సమావేశాలు 17వ తేదీ వరకూ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై ప్రభుత్వం..బీఆర్ఎస్ పైన చర్చ జరుగుతోంది.

 

నేటి నుంచి అసెంబ్లీ: తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయాల వేళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. రేపు (శుక్రవారం) గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చ చేపడతారు. అదే రోజు ప్రభుత్వం ధన్యవాదాల తీర్మానానికి సమాధానమిస్తుంది. కాగా.. 10వ తేదీన ప్రభుత్వం శాసనసభలో ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు. తిరిగి 12న అసెంబ్లీ ప్రారంభమయ్యాక బడ్జెట్‌పై చర్చ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చ ఎన్ని రోజులపాటు జరిగేదీ శాసన సభా వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశంలో నిర్ణయించనున్నారు.

 

సభకు కేసీఆర్: ప్రభుత్వం ఈ సెషన్స్‌లోనే సాగునీటి పారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టనుంది. దీనిపై ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై చర్చ జరిగే అవకాశముంది. ఇది కాకుండా… కుల గణనపైనా ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

 

ఈ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి రెండు కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించే వారికి బిల్లు కట్టే అవసరం లేదనే హామీ అమలు చేయనున్నారు. ఈ రెండు పథకాలను సీఎం సభలో ప్రకటించనున్నారు. అభయ హస్తం ద్వారా అప్లై చేసుకున్న వారిలో ఎంత మంది ఏ పథకానికి అర్హులన్న గణాంకాలను సేకరించిన ప్రభుత్వం ఈ సమావేశాల ద్వారా అమలు తేదీని ఖరారు చేయనుంది.

 

ప్రాజెక్టుల పై చర్చ: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి నుంచి సభకు హాజరు కానున్నారు. నీటి ప్రాజెక్టుల వివాదంపై వాడివేడిగా చర్చ జరగనుంది. ప్రభుత్వం తాజాగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై జరిగే చర్చలో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశ: పైన సీఎం రేవంత్ చేసిన సవాల్ కు బీఆర్ఎస్ సై అంది. బడ్జెట్ ప్రతిపాద‌న‌కు ఒక రోజు కేటాయించి.. రెండు నుంచి మూడు రోజులు బడ్జెట్ పై చర్చ చేపట్టే అవకాశం ఉంది.

 

వ్యవసాయంపై శ్వేతపత్రం విడుదల చేసి రెండు రోజులు సభలో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టుల విషచంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీ వేడీ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాలు 17వ తేదీ వరకూ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.