TELANGANA

తెలంగాణా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకే పెద్దపీట..

రాష్ట్రంలో గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ ను ఓట్ ఆన్ ఎకౌంటు బడ్జెట్ గా ప్రవేశ పెట్టనుంది. మూడు నెలల కాలానికి ఈ బడ్జెట్ ఉన్నప్పటికీ, ఏడాది మొత్తానికి ఈ బడ్జెట్లో అంచనాలను ప్రకటిస్తారు.

 

2023 ఫిబ్రవరి నెలలో 2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా, నిర్దేశిత లక్ష్యాల మేరకు ఆదాయం రాకపోవడంతో సవరించిన అంచనాల ప్రకారం ఈసారి బడ్జెట్ 2.50 లక్షల కోట్ల వరకు ఉంటుందని సమాచారం .అయితే ఈసారి బడ్జెట్లో కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న అంశాలు ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారిన అంశం.

 

అత్యధికంగా సంక్షేమ రంగానికి 40 వేల కోట్లు, వ్యవసాయానికి 30 వేలకోట్లు, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు 30 వేల కోట్లు, విద్యుత్ శాఖకు 18 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండొచ్చని సమాచారం. ముఖ్యంగా ఈసారి బడ్జెట్లో నిధుల కేటాయింపులో ఆరు గ్యారెంటీ లకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీలేక్ దాదాపు 60 వేల కోట్లకు పైగా అవసరమని ఒక అంచనా.

 

ఈ కారణంగానే విద్యుత్, వ్యవసాయ, సంక్షేమ శాఖలకు భారీగా నిధులను బడ్జెట్లో కేటాయించినట్లు తెలుస్తోంది . శాఖల వారీగా ఆరు గ్యారెంటీ ల అమలుకు బడ్జెట్ కావాలని కోరిన నేపథ్యంలోనే వివిధ శాఖలకు భారీగా బడ్జెట్ కేటాయింపులు జరిగినట్టు సమాచారం. ఇదిలా ఉంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే సామాజిక ఆర్థిక సర్వే నివేదికను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది.

 

అయితే ప్రస్తుతం వోట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ నివేదికను విడుదల చేయడం లేదని తెలుస్తుంది. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదికను కూడా విడుదల చేస్తారని సమాచారం.

 

రాష్ట్ర అసెంబ్లీలో నేడు 12 గంటలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. ఆపై రేపు అసెంబ్లీకి సెలవు కాగా, 12, 13వ తేదీలలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి