TELANGANA

కొమురవెల్లిలో రైల్వే స్టేషన్.. నెరవేరుతున్న ఛిరకాల వాంఛ..

ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న భక్తులకు ఛిరకాల వాంఛ తీరబోతోంది. కొత్తపల్లి-మనోహరాబాద్ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌తో కలిసి భూమి పూజ చేశారు. అంతకుముందు వీరు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంత్ రెడ్డి ఉన్నారు.

 

ఈ సందర్భంగా కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రైల్వే స్టేషన్‌లు తక్కువగా ఉన్నాయని.. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. 2014 రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ. 250 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు 6వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. మెదక్, సిద్దిపేట రైల్వే లైన్ కూడా బీజేపీ ప్రభుత్వమే నిర్మించిందని చెప్పారు.

 

 

రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) కోసం రూ. 26 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించబోతోందని కిషన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం భూసేకరణ చేయకుండా నిర్లక్ష్యం చేసిందని.. కొత్త ప్రభుత్వం భూ సేకరణ చేస్తే వెంటనే ఆర్ఆర్ఆర్ పనులు ప్రారంభమవుతాయన్నారు. కాగా, కొమురవెల్లి వద్ద హాల్ట్ స్టేషన్ నిర్మించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఎంపీ బండి సంజయ్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భక్తులు వినతి పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి వీరు ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

 

ఈ నేపథ్యంలో కొమురవెల్లి ఆలయానికి 3 కి.మీ దూరంలో రైల్వే స్టేషన్ ను మంజూరు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. స్టేషన్ ఏర్పాటుతో లక్షలాది మందికి ప్రయోజనం చేకూరనుంది. కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి ఏటా 25 లక్షల మందికిపైగా నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. సుమారు 70 శాతం మంది సామాన్య భక్తులే ఉంటారు. వీరంతా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ఆలయానికి చేరుకుంటారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ రావడంతో భక్తులు రైళ్లలో ఆలయానికి తక్కువ తక్కువ ఖర్చుతో చేరుకునే అవకాశం ఉంది. ప్రయాణభారం కూడా తగ్గనుంది.