తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో శ్వేతపత్రం విడుదల చేసింది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో నీటిపారుదల రంగంపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.
అనంతరం మాట్లాడుతూ…ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులలో అవినీతికి చోటులేకుండా, సమర్థ వినియోగంతో, అత్యధిక ఆయకట్టుకు నీరు అందించేందుకు అవసరం అయిన నిధులను సమకూర్చుకునే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సగం కంటే ఎక్కువ పూర్తి అయిన కారణంగా ప్రధానమంత్రి కృషి సించాయ్-పథకం కింద నిధులు సమకూర్చుకుని వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.
కృష్ణానది జలాలలో రాష్ట్ర వాటా సాధించుకునేందుకు చర్యలు తీసుకుంటూ…పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేసి దక్షిణ తెలంగాణలో ఆయకట్టుకు సాగునీరందిస్తామని చెప్పారు. NDSA, కాగ్, విజిలెన్స్ నివేదికల ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి పలుచోట్ల డిజైన్, నిర్మాణం, నిర్వహణ ప్రక్రియల్లో పలు లోపాలు వెలుగుచూశాయనీ, మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటుకు కూడా అవే కారణాలని మంత్రి చెప్పారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మూడు జలాశయాల్లోనూ ఇవే లోపాలున్నాయని చెప్పారు. అన్నారం బ్యారేజీలో కూడా నిన్న లీకేజీలు వెలుగుచూశాయనీ, పగుళ్ళు ఏర్పడ్డాయని ఆనకట్ట ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ, విజిలెన్స్ కమిటీ నివేదిక, కాగ్ నివేదికలను ఊటంకిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న లోపాలను మంత్రి శాసనసభకు వివరించారు.
దేశం అవాక్కయ్యే రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని కాగ్ నివేదికను ఉటంకిస్తూ మంత్రి పేర్కొన్నారు. మొదట 1800 కోట్ల పనులకు మేడిగడ్డ ఆనకట్ట కోసం టెండర్లు పిలిచినా ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ ఖర్చును 4500 కోట్ల రూపాయిలకు పెంచినట్లు చెప్పారు.
స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇంత అవినీతి మరెక్కడా జరగలేదన్నారు. మల్లన్న సాగర్ జలాశయాన్ని కనీస సిస్మిక్ నివేదికలు లేకుండానే నిర్మించారనీ, 25 వేల కోట్ల రూపాయిలపైగా కాంట్రాక్టులను డీటైల్డ్ ప్రాజెక్టు నివేదికలు లేకుండానే గత ప్రభుత్వం అప్పగించీందని చెప్పారు. గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి మరి ఎక్కడ జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.