TELANGANA

తెలంగాణలో డ్వాక్రా మహిళలకు శుభవార్త ..

తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలక మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

 

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల అభివృద్ధి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. గత నాలుగేళ్లుగా ఐటీడీఏలో పాలక మండలి సమావేశం జరగలేదన్నారు. ఇక ఇప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.

 

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం సాక్షిగా డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెబుతున్నామన్నారు భట్టి విక్రమార్క. ఇప్పటికే మహిళలకు పెద్ద పీట వేసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఇందిరా కాంతి పథకం కింద త్వరలో డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు.

 

మరోవైపు, పాఠశాలలో మధ్యాహ్న భోజనం, వంట కార్మికులకు, ఆశా కార్యకర్తలకు చాలా కాలంగా సమయానికి వేతనాలు పడటం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటన్నింటిపై అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజలు తమపై ఉంచిన నమ్మకం మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడపటానికి ప్రత్యేక కృషి చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

 

గత ప్రభుత్వ హయాంలో ఐటీడీఏ పాలక మండలి సమావేశాలు సమయానికి నిర్వహించలేదని మండిపడ్డారు. ఇవాళ పాలకమండలి సమావేశాలు ఉన్నాయని తెలియడంతో మంత్రులందరూ హుటాహుటిన వచ్చారన్నారు. గిరిజనులకు సమస్యలను త్వరితగతిన తీర్చేందుకు అధికారులు చొరవ చూపాలని సమావేశంలో సూచించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.