TELANGANA

మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

మూసీ నది అభివృద్ధి ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. మూసీలో మురుగునీటిని ముందుగా శుద్ధి చేయాలని సీఎం సూచించారు. సోమవారం మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్‌గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

 

మూసీ సరిహద్దులు, ఇతర వివరాలతో కూడిన పటాలను అధికారులు సీఎంకు వివరించారు. అధికారులు పని విభజన చేసుకొని మూసీ పరీవాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సమీక్షలో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు దానకిశోర్, ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు

ఇందుకు ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ సూచించారు.

 

అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో చినజీయర్ స్వామి (Chinnajeeyar Swamy) కలిశారు. సమత కుంభే పేరుతో నిర్వహించనున్న రామానుజాచార్య 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని చినజీయర్ స్వామి ఆహ్వానించారు. రామానుజ జీవిత విశేషాలను సీఎంకు చినజీయర్ స్వామి వివరించారు.

 

ఇది ఇలావుండగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎం రేవంత్ తోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.