మేడారం హుండీల లెక్కింపు జరుగుతోంది. నాలుగు రోజులపాటు జరిగిన జాతరలో భక్తులు కానుకలు సమర్పించారు. అయితే హుండీల లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు రావడం కలకలం రేపింది. విచిత్రంగా నకిలీ కరెన్సీపై రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేద్కర్ ఫొటో ఉండడం గమనార్హం. ఇలా అంబేద్కర్ ఫొటో ఉన్న రూ.100 కరెన్సీ నోట్లు ఎక్కువగా కనిపించాయి.
అంబేద్కర్ ఫొటో ముద్రణకు డిమాండ్..
హుండీల్లో వేసిన ఈ కరెన్సీ నోట్ల వెనుక పలువురు భక్తులు భారత కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు నోట్లపై రాశారు. ప్రారంభంలోనే నకిలీ కరెన్సీ వస్తే ఇంకా ఎన్ని హుండీల్లో ఇలాంటి నోట్లు వస్తాయో మరి.
జాతరలో నకిలీ నోట్లుల..
ఇదిలా ఉంటే జాతర జరిగిన ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్య నకిలీ నోట్లు పెద్ద ఎత్తున చలామణి అయినట్లు తెలుస్తోంది. పలు చోట్ల రూ.200, 500 నకిలీ నోట్లను లక్షల రూపాయల్లో చలామణి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జాతరలో మద్యం, బెల్లం, కోళ్లు, ఇతర వ్యాపార దుకాణాల్లో వీటిని అందించినట్లు తెలుస్తోంది. కొందరు హుండీల్లో కూడా దొంగనోట్లు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకేసారి అధిక మొత్తంలో భక్తులు రావడం, జాతరలో కోట్ల రూపాయల వ్యాపారం జరుగడంతో అసలు నోటు, నకిలీ నోటును వ్యాపారులు పోల్చుకోకపోవడంతో ఈ నకిలీ నోట్లు చలామణి చేసినట్లు తెలుస్తోంది.