పాతబస్తీ మెట్రో లైన్‌కు శుక్రవారం ఫరూక్‌నగర్ డిపో దగ్గర శంకుస్థాపన చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మొత్తం 5.5 కిలోమీటర్ల పొడవునా 4 మెట్రో స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. రూ. 2 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని.. మిగితా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తామన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో ఎంఐఎంతో కలిసి పనిచేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి 2050 వైబ్రంట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు. పాతబస్తీలో రోడ్ల విస్తరణకు రూ. 200 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు.
మూసీ నదిని 55 కిలోమీటర్ల మేర సుందరీకరిస్తామని, మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చూపిస్తామన్నారు సీఎం రేవంత్. మెట్రో రైలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌కే కాదు .. పాతబస్తీకి ఉండాలన్నారు. ఇందులో సంపన్నులే కాదు.. మధ్యతరగతి ప్రజలూ ప్రయాణించాలన్నారు. చాంద్రాయణగుట్ట క్రాస్ మెట్రోలో అతిపెద్ద జంక్షన్ కాబోతోందని సీఎం రేవంత్ వివరించారు.
చంచల్‌గూడ జైలును అక్కడ్నుంచి తరలించి.. విద్యా సంస్థ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. రాజకీయాలు వేరే అభివృద్ధి వేరని అన్నారు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నాలుగేళ్లలోనే పాతబస్తీ మెట్రో రైలు పూర్తి చేసి ప్రయాణిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. పాతబస్తీ ఓల్డ్ సిటీ కాదని.. ఒరిజినల్ సిటీ అని అన్నారు. హైదరాబాద్‌కు తాగునీరు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు.
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు గుండెలాంటి పాతబస్తీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మీ చేతుల్లో ఐదేళ్లు అధికారం ఉంటుందని.. అభివృద్ధికి సహకరిస్తామని సీఎంతోచెప్పారు ఒవైసీ. రేవంత్ రెడ్డి చాలా పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారన్నారు.
తెలంగాణలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారని.. కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. వాటిని అడ్డుకోవాలన్నారు. పాతబస్తీలో అభివృద్ధి పనుల కోసం సీఎంను కలవగానే రూ. 120 కోట్లు విడుదల చేశారని ఒవైసీ తెలిపారు. మూసీ నది అభివృద్ధికి తమ పార్టీ సహకరిస్తుందని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
కాగా, పాతబస్తీ మెట్రోలైన్ నిర్మాణంలో భాగంగా ఎంజీబీఎస్, దారుల్ షిఫా జంక్షన్, పురాణా హవేలీ, ఇత్తేబాద్ చౌక్, అలీ జాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలీ, శాలిబండ, షంషీర్ గంజ్, అలియాబాద్ ప్రాంతాల మీదుగా రైలు మార్గం నిర్మాణం జరగనుంది. సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు.