తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రాజీనామా నేపథ్యంలో కేంద్రం కొత్త గవర్నర్ నియామకాన్ని ప్రకటించింది. జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ను కొత్త గవర్నర్ గా అదనపు బాథ్యతలు కట్టబెట్టింది. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా మరో అదనపు బాధ్యత ఇచ్చింది. అలాగే తమిళి సై సౌందర రాజన్ చేసిన రాజీనామాను కూడా ఆమోదిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రెగ్యులర్ గవర్నర్లను నియమించే పరిస్దితి లేదు. దీంతో జార్ఖండ్ గవర్నర్ కు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు. 2023 నుంచి జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ గతంలో బీజేపీలో యాక్టివ్ మెంబర్ గా పనిచేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. దీంతో ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జార్ఖండ్ తో పాటు తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలు కూడా అప్పగించారు.
మరోవైపు తెలంగాణ గవర్నర్ గా రాజీనామా చేసిన తమిళి సై సౌందర రాజన్ తమిళనాడు నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. చెన్నై లో ఏదో ఒక ఎంపీ సీటు లేదా కన్యాకుమారి, తూత్తుకుడి సీట్లను ఇందుకోసం పరిశీలిస్తున్నారు. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు వదులుకున్న తమిళిసై చెన్నై వెళ్లి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.