మహిళా దినోత్సవానికి ముందుగానే మహిళలకు సూపర్ కానుక ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పం తమదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు దఫాలు చెప్పారు. ఆ మాట మేరకు మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగానే అమలైందే.. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపని చెప్పవచ్చు.
సీఎం రేవంత్ సర్కార్ ఏడాది పాలనలో మహిళా సంక్షేమానికి పలు పథకాలు అమలు చేసింది. అందులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు. గృహ జ్యోతి పథకం ద్వారా ఒక కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తోంది. అలాగే పేద కుటుంబాలకు కేవలం రూ. 500 లకే సిలిండర్ ను అందిస్తోంది. తాజాగా ఈ నెల 8 న రానున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు వరాలు కురిపించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇలా ఓ పక్కన ఏర్పాట్లు సాగుతుండగా, మరోవైపు సీఎం రేవంత్ సర్కార్ మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేయడం విశేషం. మహిళలకు అద్దె బస్సులు కేటాయించడం కేవలం మాటలేనని కొందరు సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేశారు. కానీ సీఎం రేవంత్ సర్కార్ ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళా దినోత్సవం ముందుగానే, అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేయడం విశేషం.
మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నారు. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తారు. ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె రూ. 77, 220 చెల్లించేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్దమైంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీని స్వయంగా ప్రభుత్వం ఇవ్వడం మరో విశేషం. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే కులగణన సర్వే విజయవంతం చేసి యావత్ దేశం చూపును ఆకర్షించిన సీఎం రేవంత్ సర్కార్, తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టి ఔరా అనిపించుకుంది. అందుకే తెలంగాణలో ఈ పథకం అమలు గురించి అన్ని రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయట. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మార్చ్ 8 న పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను లాంఛనంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
మొత్తం మీద మహిళలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించడం ద్వారా, వారి కుటుంబాలకు ఆర్థిక ప్రోత్సాహకం అందినట్లేనని చెప్పవచ్చు. ఒక కుటుంబం ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు మహిళల చొరవ అవసరం. అందుకే మహిళా శక్తిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పటికే మహిళా సంఘాల అధ్వర్యంలో పెట్రోల్ బంకులు ప్రారంభించిన ప్రభుత్వం, ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించడం ఆనందంగా ఉందంటున్నారు మహిళలు.