దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత విచారణను ఎదుర్కొంటోన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. మరిన్ని రోజుల పాటు ఆమె కస్టడీలోనే ఉండనున్నారు.
నిజానికి- కవిత కస్టడీ నేటితో ముగియాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమెను అధికారులు ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని, మరింత సమాచారాన్ని కవిత నుంచి రాబట్టుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
l
ఇందులో భాగంగా- మరో 10 రోజుల పాటు కస్టడీని పొడిగించాలని అధికారులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై వాదోపవాదాలను ఆలకించిన తరువాత రోస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తులు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈడీ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించారు. కవిత కస్టడీని ఏప్రిల్ 9వ తేదీ వరకు పొడిగించారు.
కాగా- ఆమె బెయిల్ పిటీషన్‌పై వాదనలను ఆలకించడానికి న్యాయస్థానం అంగీకరించడం కొంత ఊరట కలిగించే విషయం. ఏప్రిల్ 1వ తేదీన బెయిల్ పిటీషన్‌పై వాదనలను వింటుంది రోస్ అవెన్యూ కోర్టు. ఆ రోజున లిస్టింగ్ చేసినట్లు న్యాయమూర్తులు వెల్లడించారు. వాదనలను వినిపించుకోవచ్చని తెలిపారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయం ఉన్నట్లు తాము గుర్తించామని ఇదివరకే ఈడీ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆస్తులను సైతం అటాచ్ చేశారు. వాటి విలువ 128.79 కోట్ల రూపాయలు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారులకు 100 కోట్ల రూపాయల మేర ముడుపులను బదలాయించడంలో కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని ఈడీ అధికారులు వెల్లడించారు.
ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్టయ్యారు. ఆయన కూడా ప్రస్తుతం ఈడీ అధికారుల కస్టడీలో ఉంటోన్నారు. విచారణను ఎదుర్కొంటోన్నారు. 10 రోజుల పాటు కస్టడీలో ఉండేలా ఆదేశాలను జారీ చేసింది రోస్ అవెన్యూ న్యాయస్థానం.