TELANGANA

బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై పరోక్షంగా విమర్శలు…

బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తనను తిట్టిన వారిని శిక్షించకుండా.. అవార్డులు, రివార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజ్ భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడుతూ.. తాము మహిళా మంత్రులు, మేయర్‌లు, ఇతర అధికారులకు ఆహ్వానం పంపించామని.. అందరూ ఈ కార్యక్రమానికి రాకపోయినా, వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలని తెలిపారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళను కూడా అవమానిస్తున్నారని, అలా అవమానించిన వారిని ప్రభుత్వం అందలాలు ఎక్కిస్తోందని, ఇలాంటి పనులు చేస్తూ ఆడబిడ్డలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనని ఎంతలా అవమానించినా సరే.. మహిళల కోసం పని చేస్తూనే ఉంటానని అన్నారు. కేవలం ఒక్క ఉమెన్స్ డో రోజు మాత్రమే కాకుండా.. ప్రతిరోజు మహిళలకు గౌరవం ఇవ్వాలన్నారు.

ఎంతో ప్రతిభావంతురాలైన ప్రీతి లాంటి అమ్మాయిని మనం కోల్పోయామని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతికి జరిగిన అన్యాయంపై ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు కూడా తనను అవామనించారని చెప్పారు. సోషల్ మీడియాలో తనని ఎల్లప్పుడూ విమర్శిస్తూనే ఉన్నారని.. అయినా తాను తట్టుకొని నిలబడ్డానని అన్నారు. ఎవరి కోసమో మీరు కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదని మహిళలకు ధైర్యం ఇచ్చారు. తాను వచ్చిన ప్రాంతం విలినార్ వీర మహిళలకు ప్రసిద్ది అని.. అలాంటి ప్రాంతం నుండి వచ్చిన తాను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. గిరిజన మహిళలను రక్తహీనత సమస్య వెంటాడుతుండేదని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని అన్నారు. గర్భస్థ గిరిజన మహిళలు ఇబ్బందులు పడకుండా అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల కోసం మహిళా దర్బార్ నిర్వాహించామన్నారు. ఇప్పటివరకూ తమకు 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయని, వారి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు