TELANGANA

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి మాజీ మంత్రి షబ్బీర్ అలీ లేఖ…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మాజీ మంత్రి షబ్బీర్ అలీ లేఖ రాశారు. రాష్ట్రంలో హాన్ హాయ్ ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ప్రతిపాదించిన పెట్టుబడులపై గందరగోళాన్ని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ సంస్థతో చారిత్రక ఒప్పందం కుదుర్చున్నప్పుడు.. ఫాక్స్ కాన్ ఛైర్మన్ యుంగ్ లియు హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలను నిర్మిస్తామని, దీని వల్ల ఒక లక్ష మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించినట్టు సీఎంఓ ట్వీట్ చేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే.. ఆ మరుసటి రోజే కొత్త పెట్టుబడులపై ఎలాంటి ఒప్పందాలు జరగలేదని, ఎంప్లాయ్‌మెంట్ ఫిగర్స్ కూడా ప్రత్యక్ష ఉద్యోగాలకు సమానం కావని ఆ సంస్థ ట్వీట్ చేసిందని తెలిపారు. అంటే.. సీఎంఓ పంచుకున్న వివరాలకు, ఆ సంస్థ చెప్తున్న మాటలకు పొంతన లేదన్నారు. అందుకే.. కంపెనీ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన క్లెయిమ్‌లు ఏ ప్రాతిపదికన చేశారో సీఎం కార్యాలయం నుంచి స్పష్టత ఇవ్వాలని కోరారు.

అలాగే.. తెలంగాణ ప్రభుత్వం, ఫాక్స్‌కాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని షబ్బీర్ అలీ కోరారు. ఇదే సమయంలో గత ఎనిమిదేళ్లుగా ఇతర కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై కూడా ఆయన సందేహాలను లేవనెత్తారు. కొన్ని ఒప్పందాలు లాంఛనప్రాయంగా కనిపిస్తున్నప్పటికీ.. వాటి అమలుపై స్పష్టత లేదని, రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు అవి ఏ మేరకు దారితీశాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు. ఈ సమస్యపై సందేహాలు, ఆందోళనలు ఉంటే నివృత్తి చేయాలని అడిగారు.
2014 నుంచి వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి అమలు స్థితి, పెట్టుబడుల వైఫల్యం, ఉద్యోగాల కల్పన, భూకేటాయింపు వివరాలన్నింటినీ వెల్లడించాల్సిందిగా షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. మరి, ఈ లేఖకు సీఎంఓ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి