TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికా నుంచి వస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ..!

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఈ కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఆయన కేంద్రంగా ఈ వ్యవహారం సాగిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సోమవారం ఆయన హైదరాబాద్ వస్తున్నారని తెలుస్తోంది.

 

ప్రభాకర్ రావును ప్రశ్నిస్తే కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఆయన వెల్లడించే సమాచారం ఆధారంగా బీఆర్ఎస్ నాయకులు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ ఉన్న సమంయలో రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. వారు పోలీసు కస్టడీలో ఉన్నారు. అలాగే టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధా కిషన్ రావుకు న్యాయస్థానం 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.

 

రాధా కిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలిచ్చేవారనే వివరాలు సేకరించారు. డీఎస్పీ ప్రణీత్‌ రావు.. విపక్ష నేతల , ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. వాటిపైనా సిట్ ప్రశ్నించింది.

 

ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు చాలా మంది ప్రముఖులు విరాళాలు ఇచ్చారని సిట్అ ధికారులు గుర్తించారు. ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావుకు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జ్యువెలరీ షాపుల యజమానులు లంచాలు ఇచ్చారని సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రాచకొండ ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టు మల్లును రాధాకిషన్‌రావుతో కలిపి ఇప్పటికే ప్రశ్నించారు. ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందినీ సిట్‌ విచారిస్తోంది. మొత్తం 47 మంది నుంచి వివరాలు సేకరించింది.

 

రాధాకిషన్‌ రావు, భుజంగరావు, తిరుపతన్నకు భారీ అక్రమ ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా సిట్ అధికారులు ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. ఈ విషయంపై ఏసీబీకి సమాచారం ఇవ్వాలని సిట్‌ భావిస్తోందని సమాచారం.

 

భుజంగ రావు తన సర్వీసులో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2013లో రాధా కిషన్‌రావు ఉప్పల్‌ ఏసీపీగా ఉన్నారు. ఆ సమయంలో యాంజాల్‌ శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసుపైనా సిట్ అధికారులు దృష్టిపెట్టారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీధర్ రెడ్డిని రాధాకిషన్ రావు వేధించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని అనుమానాలున్నాయి.