TELANGANA

ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఉండదా..?

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది. సీనియర్లు సైతం కేసీఆర్‌, ఆయన పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో చేరుతున్నారు.

 

ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్తం అయ్యారు కేసీఆర్. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించడానికి ఉద్దేశించిన పర్యటనలు ఇవి. కరవుతో బారిన పడ్డ రైతన్నలను పరామర్శించడం, వారిలో ధైర్యం నింపడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారు.

తెలంగాణలో గల 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. 17 లోక్‌సభ స్థానాల్లో అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే.

 

లోక్‌సభ ఎన్నికలపై తమకు ఉన్నపట్టును మరింత పెంచుకోవడానికి కేసీఆర్ సర్వశక్తులను ఒడ్డుతున్నారు. పొలం బాట పట్టారు. ఇప్పటికే జనగామ, సూర్యాపేట్, నల్గొండ జిల్లాల్లో పర్యటించారు. ఈ నెల 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారాయన. కరీంనగర్ రూరల్, వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు.

 

కేసీఆర్ చేపట్టిన జిల్లా పర్యటనలు, పొలంబాట కార్యక్రమంపై అధికార కాంగ్రెస్ ఎదురుదాడి మొదలు పెట్టింది. తన ఉనికిని కాపాడుకోవడానికే కేసీఆర్ పొలంబాట పట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎంత ప్రయత్నించినా ఇక బీఆర్ఎస్ తెలంగాణలో మనుగడలోకి రాబోదని తేల్చి చెప్పారు.

 

తమ పార్టీలో చేరుతున్న వలసలను బట్టి చూస్తేంటే తన పార్టీ మిగలదనే భయం కేసీఆర్‌కు పట్టుకుందని ఉత్తమ్ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్‌ ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఆ భయంతోనే ఉన్నారని పేర్కొన్నారు. నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేసిందే కేసీఆరేనని ధ్వజమెత్తారు. ఈ కారణం వల్ల తెలంగాణ రైతులకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.