లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.
ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి అన్ని కోణాల నుంచీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అటు వలసలు, ఇటు అరెస్టులు ఆ పార్టీని చుట్టుముట్టాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయి. సీనియర్ నాయకులు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం కేసీఆర్, ఆయన పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో చేరుతున్నారు.
ఇప్పటికే ఆయన కుమార్తె, బీఆర్ఎస్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారామె. ప్రస్తుతం దేశ రాజధానిలోని తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణకు హాజరవుతున్నారు.
అదే సమయంలో- కల్వకుంట్ల కుటుంబానికే చెందిన మరొకరు అరెస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు అరెస్ట్ అయ్యారు. ఆదిభట్ల పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ నుంచి బయటపడటానికి ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్ శివార్లలోని మన్నెగూడ వద్ద రెండెకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి కన్నారావు ప్రయత్నించినట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో 38 మందిపై భూకబ్జా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. వారి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు చెబుతున్నారు.
ఆయనపై ఐపీసీ సెక్షన్లు 307, 447, 427, 436, 148, 149 కింద ఆదిభట్ల పోలీసులు ఈ కేసు నమోదు చేశారని సమాచారం. ముందస్తు బెయిల్ కోసం కన్నారావు చేసిన ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. ఆయనకు బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు అంగీకరించలేదు.