TELANGANA

10వేల మందితో మేడిగడ్డ ముట్టడికి ముహూర్తం ఫిక్స్.. రైతులకు కేసీఆర్ పిలుపు..!

తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో నీటి ఎద్దడి చోటు చేసుకోగా పంటలు ఎండిపోతున్న పరిస్థితులపై బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ దృష్టిసారించి నేడు పొలం బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడుకరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 

రైతులతో మాట్లాడిన కేసీఆర్ పలువురు రైతులు కేసిఆర్ ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. గత సంవత్సరం నీరు సమృద్ధిగా ఉండేదని కానీ ఇప్పుడు పొలమంతా ఎండి పోయిందని రైతులు వాపోయారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందవుతుందని తెలిపారు. ఒకసారి వాగులోకి నీళ్లిస్తే రైతులంతా బతుకుతారని చెప్పారు. మొన్నటిదాకా నీరు ఇచ్చారని, ఇప్పుడు నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు.

 

రైతులకు ధైర్యం చెప్పిన కేసీఆర్ అన్నదాతలకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని, ప్రభుత్వంపై పోరాటం చేసి ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూస్తామని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. రైతులు ధైర్యంగా ఉండాలని, పోరాటం చేయాలన్నారు. రైతులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు కేసీఆర్. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మాజీ సీఎం కేసీఆర్ ఎండిన పంటలను పరిశీలించి రైతుల గోడును అడిగి తెలుసుకున్నారు.

 

ఎన్నికల తర్వాత మేడిగడ్డ ముట్టడి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల తర్వాత పదివేల మంది రైతులతో మేడిగడ్డ ను ముట్టడిస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. పంటలకు నీళ్లు రాకుండా ఎలా ఆపుతారో చూద్దామని, పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అనంతరం శభాష్ పల్లి వద్ద మానేరు జలాశయాన్ని కేసీఆర్ పరిశీలించారు.

 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పరిస్థితి తెలుసుకున్న కేసీఆర్ కెసిఆర్ తో పాటు ముగ్ధుంపూర్ లో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు. చొప్పదండి నియోజకవర్గం లోని బోయినపల్లి వద్ద రైతులతో కూడా మాట్లాడి వారి సమస్యలను కేసీఆర్ తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సాగిన పొలం బాటలో ఆయన నీటి ఎద్దడి కారణంగా ఎండిపోయిన రైతుల పరిశీలించడంతో పాటు, రైతుల సమస్యలను వారి ద్వారానే తెలుసుకున్నారు.