TELANGANA

ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో సీఎం రేవంత్.. కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నేడు ఆయ‌న ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై సీఎం చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా తెలంగాణ‌ పెండింగ్ అంశాల‌పై, విభ‌జ‌న హామీల‌పై మంత్రుల‌తో చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల‌తో సీఎం సమావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్ లో చ‌ర్చించాల్సిన అంశాల‌పై ఎంపీల‌కు దిశా నిర్దేశం చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

 

అదేవిధంగా రాష్ట్రంలోని స‌మ‌స్య‌ల‌ను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల‌ని సూచించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో రేవంత్ రెడ్డి పార్టీ పెద్ద‌ల‌ను కూడా క‌లిసే అవ‌కాశాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వ‌య‌నాడ్ ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీని కూడా క‌లిసి అభినంద‌న‌లు తెలిపే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో నిన్న‌టి మీడియా స‌మావేశంలో కేటీఆర్ కు సీఎం కౌంట‌ర్ ఇచ్చారు.

 

తెలంగాణ అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌ను తీసుకురావ‌డం కోసం ఎన్ని సార్లు అయినా ఢిల్లీకి వెళ‌తాన‌ని, కేంద్రాన్ని అడుగుతాన‌ని స్ప‌ష్టం చేశారు. సోషల్ మీడియాలోనూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ లు వ‌స్తున్నాయి. గ‌త ప్ర‌భుత్వంలో సీఎం కేసీఆర్ కేంద్రంతో స్నేహ‌పూర్వ‌కంగా ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు రాలేద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ కే ప‌రిమితం అవ్వ‌డం, ఎప్పుడూ ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌ను కానీ, విభ‌జ‌న హామీల గురించి కానీ ప్ర‌శ్నించ‌లేద‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.