TELANGANA

సిద్దిపేట్‌కు సీఎం రేవంత్.. కోకాకోలా గ్రీన్ ప్లాంట్ ప్రారంభం..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సిద్ధిపేట్‌కి వెళ్తున్నారు. సిద్దిపేట జిల్లాలో హెచ్‌సీసీబీ ఏర్పాటు చేసిన కోకా కోలా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

 

శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బివరేజెస్ సంస్థ సిద్ధిపేట్ జిల్లాలో భారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్‌ను సిఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు.

 

దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉద్యోగాలు లభించ నున్నాయి. హెచ్‌సీసీబీకి 49 ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం.

 

మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు బేగంపేట నుంచి సిద్ధిపేటకు హెలికాప్టర్లో చేరుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్‌‌‌రెడ్డి. మధ్యాహ్నం 2 గంటలకు బండ తిమ్మాపూర్ వద్ద HCCB కోకా కోలా ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు.

 

మూడు గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు ముఖ్యమంత్రి. మూడున్నరకు ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొంటారు.