మహిళా సంక్షేమానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల శిల్పారామంలో నూతనంగా ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి మహిళా శక్తి బజార్ ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ఇతర మంత్రులు అధికారులు పాల్గొన్నారు.
ఇందిరా మహిళా శక్తి బజారు ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన స్వయం సహాయక సభ్యులతో గవర్నర్ దంపతులు కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహంతో తమ వ్యాపారం జోరుగా సాగుతుందని, అలాగే నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి తాము చేరుకున్నట్లు వారు వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నట్లు మహిళలు వెల్లడించగా.. గవర్నర్ ప్రత్యేకంగా వారిని అభినందించారు. ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి మహిళా సమాఖ్యల అవసరాన్ని ప్రాధాన్యతను అక్కడి మహిళలకు వివరించి, సమాఖ్యలను ఏర్పాటు చేయించామని మహిళలు తెలపడంతో గవర్నర్ సతీమణి కూడా వారిని ప్రశంసలతో ముంచెత్తారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు, గృహ జ్యోతి పథకాలతో లబ్ధి చేకూర్చామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా మహిళల కోసమే అమలు చేసినట్లు తెలిపారు. మహిళలను అన్ని రంగాలలో ముందుంచే విధంగా తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుందని సీఎం అన్నారు.
రుణమాఫీ పథకం ద్వారా ఎందరో రైతు కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోలార్ ప్రాజెక్ట్ ల విషయంలో మహిళా సంఘాలకు అవకాశం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఏదైనా కుటుంబం ఆర్థికంగా బలపడాలంటే, మహిళలు కుటుంబ భాద్యత తీసుకుంటేనే అది సాధ్యమవుతుందని సీఎం రేవంత్ అన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్న ఇందిరమ్మ కలను తెలంగాణ మహిళలు సాకారం చేస్తున్నారని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.