TELANGANA

ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మన్మోహన్ పేరు.

హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు మరో భారీ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఆరాంఘర్ – జూ పార్క్ ఫ్లై ఓవర్ ను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ. 799 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ ను జీహెచ్ఎంసీ నిర్మించింది. మొత్తం ఆరు లైన్లతో 4.8 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ ను నిర్మించారు.

 

ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ చేయాల్సి ఉందని, అందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. రీజనల్ రింగ్ పూర్తయితే హైదరాబాద్ రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు. పీవీ ఎక్స్ ప్రెస్ ఫ్లై ఓవర్ తర్వాత ఆరాంఘర్ ఫ్లై ఓవర్ హైదరాబాద్ నగరంలో రెండవదిగా నిలిచిందని సీఎం తెలిపారు.

 

హైదరాబాద్ నగరాన్ని నిజాం ఎంతో అభివృద్ధి చేశారని కానీ, కబ్జా కోరల్లో చిక్కుకొని నగరం ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటుందని సీఎం తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ తండ్రి బాటలోనే నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఎంఐఎంతో కలిసి హైదరాబాద్ అభివృద్ధికి ముందడుగు వేస్తామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలన్న తత్వం తమదని, అభివృద్ధికి ఎవరు సహకరించినా వారికి తమ సహకారం పూర్తిస్థాయిలో ఉంటుందని సీఎం తెలిపారు.

 

వైఎస్ హయాంలో అతి పెద్ద ఫ్లైఓవర్ పీవీ ఎక్స్ప్రెస్ వే నిర్మించుకున్నామని, మళ్లీ ఇప్పుడు రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ నిర్మించుకుని మనకు మనమే పోటీ అని నిరూపించుకున్నట్లు సీఎం అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని, ఆనాడు నిజాం హయాంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను నిర్మించి హైదరాబాద్ తాగునీటి సమస్యను తీర్చారని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం లాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

 

హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితో కలిసి పనిచేయడానికైనా తాము సిద్ధమని, హైదరాబాద్ అభివృద్ధికి ఎంఐఎంను కలుపుకుని ముందుకు వెళతామని సీఎం తెలిపారు. ఇది ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ.. ఒరిజినల్ హైదరాబాద్ అంటూ సీఎం అనగానే సభ దద్దరిల్లింది. మిరాలం ట్యాంక్ పై కేబుల్ బ్రిడ్జి నిర్మించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామంటూ, అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పనులు పూర్తి చేసే బాధ్యత ఇక్కడి ప్రజా ప్రతినిధులదేనని, త్వరలోనే గోషామహల్ లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ ఫ్లై ఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నా అంటూ సీఎం చెప్పారు.