TELANGANA

తెలంగాణలో గ్రూప్ -1 ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలో గ్రూప్ -1 ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. గ్రూప్ -1 పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో గ్రూపు – 1 మెయిన్స్ పరీక్షలు గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 563 పోస్టులకు గాను 31,403 (క్రీడల కోటా కలిపి) మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు.

 

అయితే, జీవో నెం.29ని రద్దు చేయాలని, గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రాజకీయ పార్టీలు సైతం వారికి మద్దతు ఇవ్వడంతో ఆందోళనలు తీవ్రమయ్యాయి. పెద్ద ఎత్తున నిరసన తెలిపిన అభ్యర్థులు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టులో వారికి వ్యతిరేక తీర్పు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షలు మొదలైన రోజే కేసు విచారణకు రావడంతో పరీక్షలు నిలిపివేసేందుకు కోర్టు అనుమతించలేదు. దీంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

 

ఇక పిటిషన్లపై తెలంగాణ ప్రభుత్వం వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు .. అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. దీంతో కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో టీజీపీఎస్సీ త్వరలో గ్రూప్ -1 ఫలితాలు విడుదల చేయనుంది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత మొట్టమొదటి గ్రూప్ 1 నియామకాలు ఇవే కావడం విశేషం.