TELANGANA

తెలంగాణలో మరోసారి ఓట్ల పండగ రానుందా..?

తెలంగాణలో మరోసారి ఓట్ల పండగ రానుంది. పల్లెలు ఇందుకు వేదిక అవుతున్నాయి. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా పావులు కదుపుతోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక చేరింది. మండలం యూనిట్‌గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లపై కసరత్తు జరుగుతోంది.

 

రెండు రోజుల్లో కలెక్టర్లకు రిపోర్టు పంపనుంది ప్రభుత్వం. జిల్లాల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు కలెక్టర్లు. ఈ ప్రాసెస్ జరిగిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల మాట. రెండు విడతలుగా పంచాయితీ ఎన్నికలను నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

 

తొలుత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీకి ప్రయార్టీకి ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. షెడ్యూల్ విడుదలైన రెండు వారాల్లో ఎన్నికలు జరిగే ఛాన్స ఉంది. గతంలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఈసారి రెండు విడతలుగా కుదించాలన్నది ప్రభుత్వ వర్గాల మాట.

 

గతేడాది జనవరి చివరితో పంచాయితీ సర్పంచుల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. నార్మల్ గా అయితే పదవీకాలం గడువుకు ఆరు నెలలు ముందుగానీ తర్వాత గానీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల ప్రక్రియ డిలే కావడంతో ఆలస్యమైంది. రెండువిడతల్లో పంచాయితీ ఎన్నికలు, ఒకేసారి ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

 

ఇదిలాఉండగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి (కొత్త-పాతవి) సమగ్ర వివరాను వారంలో అందజేయాలని మున్సిపల్ శాఖ అధికారులను ప్రభుత్వం కోరినట్టు సమాచారం.

 

వీటితోపాటు గతంలో ఎన్నికల ఫలితాలు, రిజర్వేషన్ల వివరాలు కూడా కావాలని కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 154 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. వార్డులు, డివిజన్ల వారీగా లెక్కలను ప్లానింగ్ విభాగం నుంచి డెడికేషన్ కమిషన్ ఇప్పటికే తీసుకుంది. వీటిని అధ్యయనం చేసి మరో మూడు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నది కమిషన్ వర్గాల మాట.

 

కులగణన ద్వారా రాష్ట్రంలో 56 శాతం పైగానే బీసీలు ఉన్నట్లు తేలింది. వాటి వివరాలను డెడికేషన్ కమిషన్ కు అందించింది. వాటి ఆధారంగా ఏయే వార్డులు, పంచాయితీలు, మండలాలను బీసీలకు కేటాయించాలో కమిషన్ సిఫార్సు చేసినట్టు తెలిసింది. వాటి ఆధారంగానే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు లోబడి కమిషన్ నివేదిక రెడీ చేసింది.

 

స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి కేడర్‌ను సమాయత్తం చేస్తున్నాయి. స్థానిక ఎన్నికలను అధికార పార్టీ సవాల్‌గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాదాపు 80 నుంచి 90 శాతం సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉంది.

 

బీజేపీ వరుస విజయాలతో ఊపు మీదుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇక బీఆర్ఎస్ గురించి చెప్పనక్కర్లేదు. కేటీఆర్, హరీష్ రావు, కవిత వివిధ జల్లాల్లో కేడర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈనెల చివర గజ్వేల్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది కారు పార్టీ.