APTELANGANA

తెలుగురాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్‌..!

తెలుగురాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్‌ నెలకొంది. ఏపీలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌తో కోళ్లు మృత్యువాత పడతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలులంకలోని ఓ ఫౌల్ట్రీ ఫామ్‌లో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. 24 గంటల్లో 10 వేల కోళ్లు మృతి చెందినట్లు లెక్కలు వేశారు. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా డిస్పోజ్ చేయాలని వెటర్నరీ అధికారులు సూచించారు. దీంతో చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చిపెట్టారు ఫౌల్ట్రీ యజమాని.

 

మరోవైపు.. గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో వైరస్‌తో చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలలో తీసుకున్న శాంపిల్స్ పాజిటివ్‌గా వచ్చింది. దీంతో మరోసారి రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

 

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో కోళ్ల ఫారాల వద్ద పనిచేస్తున్న వారికి ఆరోగ్యశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఆయా ప్రదేశాల్లో జాగ్రత్తలు వహించాలని కోళ్లఫారాల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. బర్డ్ ఫ్లూ పెరుగుదల నేపథ్యంలో ఏపీ సర్కారు ముందస్తు చర్యలు చేపట్టింది.

 

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలంతో తెలంగాణ సర్కారు అప్రమత్తం అయ్యింది. తెలంగాణ సరిహద్దు అయిన కృష్ణాజిల్లాలోనూ బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోవటంతో.. అక్కడ నుంచి సరఫరాలను నిలిపివేశారు. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూడు చెక్‌పోస్టులు పెట్టి.. ఏపీ నుంచి కోళ్లు రాకుండా చూస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను.. అధికారులు వెనక్కి పంపుతున్నారు.

 

బాయిలర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ కారణంగా ఆంధ్రా- తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురంలోని చెక్‌పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వాటిని తెలంగాణలోకి రాకుండా వెనక్కి పంపుతున్నారు. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో.. వారం రోజులుగా తనిఖీలను ముమ్మరం చేశారు. ఏపీకి చెందిన ప్రతి వాహనాన్నీ.. తనిఖీ చేస్తున్నారు.

 

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర వెటర్నరీ అధికారులు, పోలీసులు చెకింగ్స్ చేస్తున్నారు. ఆంధ్ర నుంచి వస్తున్న కోళ్లను బ్యాన్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఈ నెల ఏడు నుంచి ఇంతవరకు ఏపీ నుంచి కోళ్ల వాహనాలు తెలంగాణలోకి రాలేదని చెప్పారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేనప్పటికీ.. జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

 

ఇదిలా ఉంటే.. ఆంధ్రలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తితో తెలంగాణలోని గద్వాల జిల్లా వెటర్నరీ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వస్తున్న కోళ్లు, కోడి పిల్లలు, బాతుల వాహనాలను అడ్డుకొని తిరిగి వెనక్కి పంపుతున్నారు. పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఆంధ్రాలో బర్డ్ ప్లూ వైరస్ వ్యాధితో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న కోళ్లను బోర్డర్‌లో అడ్డుకుంటున్నారు.