TELANGANA

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించారని.. రూ. 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఇవాళ అప్పులపై వడ్డీలకే ఏటా రూ. 70 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం దేశంలో మరెవరూ లేరని కేసీఆర్‌ను దుయ్యబట్టారు.

 

సింగరేణి కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఎంవోయూపై సింగరేణి సీఎండీ బలరాం, బ్యాంకర్లు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంోల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థపై అదనంగా ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఈ పథకం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటివరకు సైనికులకు మాత్రమే ఉన్న బీమా పథకాన్ని సింగరేణి కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ సర్కార్‌కే దక్కిందన్నారు. కార్మికులకు కోటి రూపాయల బీమా పథకం గతంలో ఎప్పుడూ లేదని రేవంత్ అన్నారు.

 

సింగరేణిలోని 43వేల మంది కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని సీఎం తెలిపారు. కార్మికుల కుటుంబాలను కాపాడుకునేందుకే ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టామన్నారు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా రూ.40 లక్షల బీమా వర్తిస్తుందని సీఎం తెలిపారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి భారీ బీమా పథకం దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు.

 

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంస్థల్లో సింగరేణి సంస్థ కూడా ఉందన్నారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు తమ వంతు పాత్ర పోషించారు. గత పదేళ్లు సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదన్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం పదేళ్లపాటు నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి కల్పించారని మండిపడ్డారు.

 

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధును అక్టోబర్‌లో మొదలు పెట్టి ఏప్రిల్‌లో పూర్తి చేసిందని తెలిపారు. ఇక, కేంద్రప్రభుత్వం సహజ వనరులను ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపించారు. ఎన్నో ప్రభుత్వ సంస్థలతో పాటు బొగ్గు గనులకు కూడా కేంద్రం వేలం వేస్తోందన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే వర్తించాలని రేషన్ కార్డు నిబంధన పెడుతున్నామని చెప్పారు. లబ్ధిదారుల గుర్తింపు నిరంతరం జరుగుతుందన్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేసి నిరంతరం కొత్త లబ్ధిదారులను చేరుస్తామని సీఎం రేవంత్ తెలిపారు.