TELANGANA

ఎల్ఆర్ఎస్‌పై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం..

తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) దరఖాస్తులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది గత మూడున్నరేళ్ల ఎదురుచూపులకు తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఆదాయ సమీకరణ, వనరులపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

 

ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా మొత్తం రుసుం చెల్లించిన దరఖాస్తుదారులకు లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేవదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్‌లను క్రమబద్ధీకరించాలనే నిర్ణయానికి వచ్చింది. గతంలో రూ. వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరనుంది.

 

 

నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

 

రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పెండింగ్‌లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆనాడు విక్రమార్క తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎల్ఆర్ఎస్‌పై ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.