AP

ఏపీ స్పీకర్ సంచలనం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించారు.

 

ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. మరోవైపు, మద్దాల గిరి, కరణం బలరామ్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్ పై టీడీపీ పిటిషన్ ఇచ్చింది. దీంతో ఇటీవలే విచారణ ముగించిన స్పీకర్ తమ్మినేని సీతారం ఈ మేరకు ఇరు పార్టీలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.

 

అయితే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది వారాల్లో జరగనున్న క్రమంలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గెలిచిన పార్టీని విడిచి మరో రాజకీయ పార్టీకి మారడంతోనే వీరిపై అనర్హత వేటు వేశారు.