TELANGANA

టిడిపికి రెడ్ బుక్..! బిఆర్ఎస్ కు పింక్ బుక్..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నిరంకుశ పాలన సాగిస్తుంది అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని కవిత ఫైరయ్యారు. జనగామలో మాట్లాడిన ఆమె తాము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని ఇంతకింత చెల్లిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో రెడ్ బుక్ లా తెలంగాణలో పింక్ బుక్ మెయింటైన్ చేస్తామన్నారు.

 

లెక్క చూస్తాం… వదిలిపెట్టం: ఎమ్మెల్సీ కవిత

తమ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్క చూసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిడుతుంటారని, కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా కేసులు పెడుతున్నారని చెప్పారు.

 

బీసీ రిజర్వేషన్ బిల్లుపై కవిత వ్యాఖ్యలు

తాము కూడా అన్ని లెక్కలు పక్కాగా రాసుకుంటామని, అందరి లెక్కలు కచ్చితంగా తేలుస్తామని ఆమె తెలిపారు. ఇక బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించామని చేతులు దులుపుకుంటే సరిపోదని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు. విద్యలో 46శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, ఉద్యోగాలలో 46% రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లు, స్థానిక ఎన్నికలలో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇంకొక బిల్లు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

 

కాంగ్రెస్ బీసీ బిల్లు విషయంలో ఇలా చేస్తుందని సమాచారం

ఇచ్చిన హామీ ప్రకారం రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమె పేర్కొన్నారు. బిల్లు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయని, కానీ జాప్యం చేస్తే ఇతరులు కోర్టుకు వెళ్లే అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్టు తమకు నిర్దిష్టమైన సమాచారం ఉందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

 

కాంగ్రెస్ ధోకేబాజ్ పార్టీ

ఇక రాష్ట్రంలో కుల సర్వే ను ఉద్దేశించి సీరియస్ అయిన ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ధోకేబాజ్ పార్టీ అంటూ మండిపడ్డారు 15 రోజులు కాకుండా నెల రోజులు పాటు మళ్ళీ కుల సర్వేకు అవకాశం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రీసర్వే పైన ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలని టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.