TELANGANA

రేవంత్ రెడ్డి బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే అలా చేయడు: కేటీఆర్ విమర్శ..

రేవంత్ రెడ్డి బాధ్యత గల ముఖ్యమంత్రి అయి ఉంటే ఎస్ఎల్‌బీసీ ప్రమాదం, రెస్క్యూ ఆపరేషన్‌పై దృష్టి సారించి ఉండేవారని, కానీ ఆయన మాత్రం ఎన్నికలు, ఢిల్లీ పర్యటనలు అంటూ తిరుగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రమాదాన్ని పక్కన పెట్టి చక్కర్లు కొట్టే రేవంత్ రెడ్డికి పాలన అంటే ఏమిటో తెలుసా? అని మండిపడ్డారు.

 

‘సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేటి సిగ్గు’ అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్‌బీసీ ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని తెలిపారు. రేవంత్ రెడ్డి చూడాల్సింది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కాదని, కేసీఆర్ చెప్పిన వీడియోను చూడాలని అన్నారు. అప్పుడైనా కొంచెం విషయ పరిజ్ఞానం వస్తుందని అన్నారు.

 

పనులు ఆగిపోవడం వల్ల ఎస్ఎల్‌‌బీసీలో బేరింగులు పని చేయడం లేదనడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు. పనులు ప్రారంభించడానికి ముందు టెక్నికల్ అసెస్‌మెంట్, జీఎస్ఐ సర్వే ఏమైనా చేశారా? అని నిలదీశారు. లేక గుడ్డిగా కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారా? అంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తే దాని గురించి మాట్లాడకుండా పనికిమాలిన లీకులు, అక్కరకు రాని చిట్‌చాట్ ఎందుకని విమర్శించారు.