TELANGANA

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో 8 మంది ఆనవాళ్ల గుర్తింపు, దారుణంగా లోపలి పరిస్థితులు..

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది సిబ్బందిని బయటికి తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు వివరాలను మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. గల్లంతైన వారి ఆచూకీ మరికొద్ది గంటల్లోనే లభించే అవకాశం ఉందని తెలిపారు.

 

టన్నెల్ వద్ద సహాయక చ్యలను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టన్నెల్‌లో మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు కనిపించిన ప్రదేశంలో తవ్వకాలు జరుగుతున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. 5-8 మీటర్ల మట్టిదిబ్బ కింద నలుగురి వ్యక్తుల ఆనవాళ్లు ఉన్నట్లు రాడార్ సర్వే ద్వారా చేసిన స్కానింగ్‌లో కనిపించాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

 

మరో నలుగురు సిబ్బంది టన్నెల్ బోరింగ్ మిషన్ కింద ఉన్నట్లు తెలుస్తోందని మంత్రి వెల్లడించారు. సహాయక చర్యల్లో మొత్తం 12 విభాగాలు చురుగ్గా పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. పనులు వేగంగా జరగడం లేదని కొందరు విమర్శిస్తున్నారని.. వారికి టన్నెల్ లోపల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియట్లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

విమర్శించేవారు లోపలికి వెళ్లి చూస్తే పరిస్థితి అర్థమవుతుందన్నారు మంత్రి జూపల్లి. కాళేశ్వరంలో 200 కిలోమీటర్ల సొరంగం తవ్వామని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అంటున్నారని.. మరి పదేళ్లలో ఎస్ఎల్బీసీలో 20 కిలోమీటర్ల టన్నెల్ ఎందుకు తవ్వలేకపోయారని మంత్రి ప్రశ్నించారు. గత పదేళ్లలో ఎస్ఎస్ఎల్బీసీని పూర్తి చేసుంటే ఈ ఘటన జరిగివుండేది కాదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.