TELANGANA

హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం: కేటీఆర్..

హైడ్రా పేరుతో, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ‘పడిపోయిన రిజిస్ట్రేషన్లు’ అంటూ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

 

అధికారం కోసం ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేస్తామని చెబుతారని, అధికారం దక్కిన తర్వాత ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని ఎద్దేవా చేశారు. హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలో పేదల ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల రిజిస్ట్రేషన్లు పాతాళానికి పడిపోయాయని పేర్కొన్నారు.

 

ఆదాయం అడుగంటి పోయిందని, ఖజానా ఖాళీ అయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో లక్షన్నర కోట్ల అప్పులు అయ్యాయని, కానీ హామీల అమలు మాత్రం గాల్లో కలిసిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పదిహేను నెలల పాలన నిర్వాకం మూలంగా రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గారడిలో సామాన్యులు సమిధలుగా మారారని మండిపడ్డారు. తెలంగాణ మేలుకోవాలంటూ ట్వీట్‌ను ముగించారు.