TELANGANA

అవినీతి, కమీషన్లు: బీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడిన జేపీ నడ్డా

హైదరాబాద్: కుటుంబ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda). ప్రాంతీయ పార్టీల్లో ఎప్పుడూ వారి వారసులే పదవుల్లో ఉంటారని..

వారసులను పదవుల్లో కూర్చోబెట్టడం గురించే ఆలోచిస్తుంటారని అన్నారు. చేవెళ్లలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న జేపీ నడ్డా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

దేశం గురించి, ప్రజల గురించి ప్రాంతీయ పార్టీలు ఆలోచించవని జేపీ నడ్డా అన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్‌ ప్రజల సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌(BRS) అంటే భ్రష్టాచార్‌ రాక్షసుల సమితిగా మారిందని విమర్శించారు. కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. వేలాది మంది బలిదానాల వల్ల తెలంగాణ సాకారమైందని.. వారి బలిదానాలను కేసీఆర్‌ కుటుంబం వృథా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ పదేళ్ల కాలంలో తన కుటుంబీకులకే పదవులు ఇచ్చి యువతను పూర్తిగా మోసం చేశారని జేపీ నడ్డా మండిపడ్డారు. . ఓట్ల కోసం ముస్లిం రిజర్వేషన్లు పెంచి హిందువులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. రూ.1.20 లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కమీషన్లు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చి ఈ తొమ్మిదేళ్లలో ఎంతమందికి రెండుపడక గదుల ఇళ్లు ఇచ్చారో ఆలోచించాలని జేడీ నడ్డా సభకు వచ్చిన ప్రజలను కోరారు.

మియాపూర్‌ భూముల వేలంలో కేసీఆర్‌ కుటుంబం రూ.4 వేల కోట్లు దోచుకుందని జేపీ నడ్డా ఆరోపించారు. ప్రతి పనిలో కేసీఆర్‌ కుటుంబం 30 శాతం కమీషన్లు తీసుకుంటోందని ఆరోపించారు. దళితబంధులో కూడా బీఆర్‌ఎస్‌ నేతలు కమీషన్లు తీసుకున్నారనారు. మోడీ పాలనలో భారత్‌.. ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని బీజేపీ జాతీయ చీఫ్‌ జేపీ నడ్డా గుర్తు చేశారు. ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.