తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రేవంత్‌రెడ్డి మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేలా ఒక బిల్లు ముసాయిదా తీసుకురానుంది. అలాగే విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండో బిల్లు ముసాయిదా తయారు చేశారు అధికారులు. ఈ రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. 2017లో అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ల పాత బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.
ఎస్సీ వర్గీకరణపై
గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించింది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికను ఆమోదించింది. ఎస్సీ కులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ మార్చి రెండున రెండో నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఫిబ్రవరి మూడున మొదటి నివేదికలో చేసిన సిఫారసులను ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యధాతధంగా ధ్రువీకరించింది.
వివిధ వర్గాల నుంచి వచ్చిన 71 విజ్ఞప్తులను రెండో విడతలో కమిషన్ పరిశీలించింది. కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై మంత్రివర్గం భేటీలో చర్చ జరిగింది. న్యాయ పరమైన చిక్కులు లేకుండా న్యాయ నిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. HMDA పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలనే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో హెచ్ఎండీఏ (HMDA) పరిధి పెరగనుంది. ఈ విస్తరణతో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు HMDA పరిధిలో కలవనున్నాయి.
మూడు కస్టర్లుగా విభజన
తెలంగాణను కోర్, అర్బన్, రూరల్ సెక్టార్లుగా విభజించింది ప్రభుత్వం. రీజినల్ రింగు రోడ్డు లోపల ప్రాంతాన్ని కోర్ ఏరియాగా పేర్కొంది. ఔటర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ బఫర్ వరకు అర్బన్‌గా ప్రస్తావించింది. ఆర్‌ఆర్‌ఆర్ బఫర్ అవతల ప్రాంతాన్ని రూరల్‌గా విభజించింది. దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని భావించింది. ఫ్యూచర్ సిటీ ప్రాంత అభివృద్ధి అథారిటీ-FCDA ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే 36 గ్రామాలు ఒకప్పుడు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండేవి. వాటిని అక్కడి నుంచి తొలగించి ఎఫ్‌సీడీఏకు బదిలీ చేసింది. ఫ్యూచర్ సిటీ కోసం 90 పోస్టులు మంజూరు చేసింది.
ఇందిరా మహిళా శక్తి మిషన్
ఇందిరా మహిళా శక్తి మిషన్-2025 పాలసీకి ఆమోదం తెలిపింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా కొత్త పాలసీ రూప కల్పన చేసింది ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు సెర్ప్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో తమ కార్యకలాపాలు చేపడుతున్నాయి. ఇకపై అన్ని మహిళా శక్తి సంఘాలు ఒకే గొడుగు కిందకు రానున్నారు. ఇందిరా మహిళా శక్తి సంఘాల్లో సభ్యుల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పెంచింది. గ్రూప్ ల్లో చేరే కనీస వయస్సును 18 నుంచి 15 ఏళ్లకు తగ్గించింది.
యాదగిరిగుట్ట, టూరిజం
టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అందుకు వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ -1987కు సవరణలు చేసింది. తెలంగాణ టూరిజం పాలసీ- 2025-30కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 27 స్పెషల్ టూరిజం ఏరియాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. రాబోయే ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో కొత్త పాలసీకి రూప కల్పన చేసింది.
మిస్ వరల్డ్-2025
మే నెలలో జరిగే మిస్ వరల్డ్-2025 పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 140 దేశాలు పాలుపంచుకునే ఈ వేడుకను ప్రపంచంలో పేరు తెచ్చేలా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
రెవెన్యూశాఖ బలోపేతంపై ప్రత్యేక దృష్టి
రెవెన్యూ శాఖ బలోపేతానికి రేవంత్ సర్కార్ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం చెప్పినట్టుగానే రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అధికారి ఉండేలా నిర్ణయం తీసుకుంది. దాదాపు 10954 గ్రామ పరిపాలన అధికారుల (GPO- Grama Palana Officer) నియామకానికి ఆమోదం తెలిపింది మంత్రి వర్గం. ఇదే కాకుండా కొత్తగా ఏర్పడిన డివిజన్లు, మండలాలకు సైతం కొత్తగా 217 పోస్టులను మంజూరు చేసింది.వీటితోపాటు 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు సైతం ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో రెవెన్యూ శాఖ బలోపేతంతోపాటు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సేవలు రైతులకు, ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నారు.
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్ పోస్టులకు, 165 అవుట్ సోర్సింగ్ పోస్టులకు మొత్తం 495 పోస్టులకు ఆమోదం తెలిపింది. గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీల కు తగ్గించాలని నిర్ణయించింది. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలో రాయికుంట గ్రామంలో 5.15 ఎకరాల భూమిని 100 పడకల ఈఎస్ఐ (ESI) ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పారాలింపిక్స్ 2024 కాంస్య పతక విజేత దీప్తి జీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది.