TELANGANA

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..! సభలో కీలక బిల్లులు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడీగా సాగను న్నాయి. 19న బడ్జెట్ రానుండడంతో ఈలోగా కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఆ బిల్లులు కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు సంబంధించినవి తెలుస్తోంది. మరోవైపు విపక్షం బీఆర్ఎస్ మాత్రం జగదీష్‌రెడ్డి అంశంపై సభను స్థంభింప చేయాలని ఆలోచన చేస్తోంది.

 

సభలో కీలక బిల్లులు

 

సోమవారం తెలంగాణ అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆదివారం రాత్రి దీనికి సంబంధించిన ఎజెండాను వెల్లడించారు. వాటిలో ఎస్సీల వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభలో పెట్టనున్నారు.

 

దీనికితోడు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లు సైతం ఉంది. తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థల బిల్లుకు పలు సవరణలు చేసి మంత్రి కొండా సురేఖ సభలో ప్రవేశపెడతారు. బిల్లులపై చర్చ తర్వాత వీటిని కేంద్రానికి పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై చర్చ తర్వాత సభ ఆమోదించనుంది. ఆ తర్వాత ఓ తీర్మానాన్ని కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయి. సోమవారం నాడు ఈ బిల్లులపై సభలో అధికార-విపక్షాల మధ్య వాడి వేడీ చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

 

జగదీష్‌రెడ్డి వ్యవహారం

 

ఇదిలావుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి వ్యవహారంపై అసెంబ్లీ చర్చకు రావచ్చని అంటున్నారు. స్పీకర్‌ను అవమానించిన ఆయన, బడ్జెట్ సెషన్ తర్వాత ఎథిక్స్ కమిటీ దీనిపై దృష్టి సారించే అవకాశముంది. గురువారం సభలో జరిగిన చర్చ వీడియో దృశ్యాలు కీలకం కానున్నాయి. దీనిపై ఆయనకు నోటీసు ఇచ్చే అవకాశమున్నట్లు ఓ చర్చ జరుగుతోంది.

 

దీనిపై వివరణ కోరిన తర్వాత ఎథిక్స్ కమిటీ ఎలాంటి సిఫార్సు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం ఫైనల్ కానుంది. ఒకవేళ అనర్హత వేటు వేస్తే సిఫార్సు చేస్తే.. సూర్యాపేటకు ఉప ఎన్నిక రావడం ఖాయమని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉప ఎన్నికకు వెళ్లే సాహసం చేస్తుందా? అనేది కీలకంగా మారింది.

 

వీటిపై ప్రశ్నోత్తరాలు

 

సోమవారం ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు ఉండనున్నాయి. ప్రభుత్వ జీవోలు అందుబాటులో ఉంచడం, సంక్షేమ హాస్టళ్లలో డైట్‌ ఛార్జీల పెంపు, హెచ్‌ఎండీఏ భూముల తాకట్టు, విదేశీ విద్యానిధి పథకం తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి సమాధానం ఇవ్వనుంది. మండలిలో కీలక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నట్లు అసెంబ్లీ వర్గాల మాట. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సీతారామ ప్రాజెక్టు, ఫార్మాసిటీ, కల్యాణమస్తు, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు రెడీగా ఉంది.

 

బడ్జెట్ వ్యవహారం

 

ఇదిలా ఉండగా బుధవారం 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆరు గ్యారెంటీలు, హామీల అమలుతోపాటు వ్యవసాయం, సంక్షేమ రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి తొలిసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న రేవంత్ ప్రభుత్వం, ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు జరిగే అవకాశముంది. ఇతర పథకాలు, కార్యక్రమాలకు నిధులను సర్దుబాటు చేయనుంది.