TELANGANA

తెలంగాణలో 153 అసెంబ్లీ సీట్లు.. డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!

రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి రూటే సెపరేటు. ఆయన స్టైల్ అందరికంటే డిఫరెంట్. ఏదో వచ్చామా.. ఏదో చేస్తున్నామా.. అన్నట్టు ఉండరు. రేవంత్ రంగంలోకి దిగారంటే.. దేత్తడి పోచమ్మ గుడి అన్నట్టే ఉంటుంది. నీళ్లు చల్లి.. బొట్టు పెట్టి.. ముస్తాబు చేసి.. మైసమ్మకు బలి ఇవ్వాల్సిందే. లేటెస్ట్‌గా కేంద్ర ప్రతిపాదిత డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు, కదుపుతున్న పావులు.. రాజకీయ కురవృద్ధులనే కంగు తినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో కాక రేపుతున్నాయి.

 

డీలిమిటేషన్‌పై తగ్గేదేలే..

 

ఏదో చెన్నై వెళ్లామా.. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నామా.. మాట్లాడుకుని వచ్చేశామా అన్నట్టు కాదు.. చెప్పినట్టుగానే తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం తీసుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని అన్నారు. పార్లమెంట్‌లో ప్రస్తుతం 553 లోక్‌సభ సీట్లు ఉండగా.. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు కేవలం130 స్థానాలు మాత్రమే ఉన్నాయన్నారు. సౌత్ ఇండియన్ స్టేట్స్‌కు ప్రస్తుతం లోక్‌సభలో 24శాతం ప్రాతినిధ్యం ఉందని.. డీలిమిటేషన్ చేస్తే ఏకంగా 19 శాతానికి పడిపోతుందని.. ఇందుకు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించమని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని.. పార్టీలకు అతీతంగా ఏకతాటిపై నిలవాలని ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి కోరారు.

 

153 అసెంబ్లీ సీట్లు.. కేంద్రానికి రేవంత్ బౌన్సర్

 

సీఎం రేవంత్‌రెడ్డి మరో ఆసక్తికర ప్రతిపాదన కూడా చేశారు. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153 కి పెంచాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ఏపీ పునర్విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయి 11 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచలేదని తప్పుబట్టారు. ఇదే సమయంలో సిక్కిం, జమ్మూ కశ్మీర్‌లో మాత్రం అసెంబ్లీ సీట్లు పెంచారని చెప్పారు.

 

డీలిమిటేషన్‌కు అగెనెస్ట్‌గా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా పోరాడుతున్నారు. తాజా అసెంబ్లీ తీర్మానంతో ఆ తీవ్రత కేంద్రానికి తాకడం ఖాయం. నెక్ట్స్ సదరన్ రాష్ట్రాల ఆల్ పార్టీ మీటింగ్ రేవంత్ నాయకత్వంలో హైదరాబాద్‌లోనే జరగబోతోంది. బహిరంగ సభ కూడా ఉండనుంది. ఆ మీటింగ్ గేమ్ ఛేంజర్ కానుంది. ఇటు.. డీలిమిటేషన్‌పై స్ట్రాంగ్ ఫైట్ చేస్తూనే.. అదే టైమ్‌లో తెలంగాణ అసెంబ్లీ సీట్లు 153కు పెంచాలంటూ మరో పదునైన నినాదం అందుకోవడంతో కేంద్రం మరింత డిఫెన్స్‌లో పడటం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో 119 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 153 కు పెంచాలి. కానీ, కేంద్రం ఇంతవరకూ పెంచలేదు. ఆ తప్పును అసెంబ్లీలో లేవనెత్తి.. డీలిమిటేషన్‌కు మరో ఆయుధాన్ని యాడ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లెక్క ప్రకారం అసెంబ్లీ సీట్లు 153కు పెరిగితే.. అప్పుడు తెలంగాణలో రాజకీయం మరింత రంజుగా మారడం ఖాయం. తబ్ ఆయేగా మజా.