హైదరాబాద్ కంచె గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములపై తక్షణమే నివేదికను పంపాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి.నగేశ్, రఘునందన్ రావు తదితరులు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.
కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కోరారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల పర్యావరణ, హెరిటేజ్ భూములని బీజేపీ నేతలు పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరమని ఈ సందర్బంగా వారు మంత్రి భూపేంద్ర యాదవ్ దృష్టికి తీసుకొచ్చారు. అనేక రకాల ఔషధ మొక్కలు, వివిధ పక్షి జాతులతో ఆ ప్రాంతమంతా సర్వంగా సుందరంగా ఉందని చెప్పారు. ఇంతటి విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తోందన్నారు.
హెచ్ సీయూ విద్యార్థులతోపాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని ఆ భూములను పరిరక్షించాలని వారు కోరారు. ఈ సందర్బంగా సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కంచె గచ్చిబౌలి భూములపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అటవీ, పర్యావరణ శాఖ అధికారులను ఆదేశించారు. నివేదిక అందిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ వారికి హామీ ఇచ్చారు.