TELANGANA

సైబరాబాద్‌పై ఉగ్రదాడికి కుట్ర.. ఎన్ఏఐ నివేదికలో కీలక విషయాలు..

హైదరాబాద్‌లో ఉగ్రదాడికి లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కుట్ర పన్నిందని, ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీ వెల్లడించినట్లు ఎన్ఐఏ నివేదిక పేర్కొంది. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తహవ్వుర్ హుస్సేన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. ఎన్ఐఏ గతంలోనే హెడ్లీని విచారించింది. ఈ విచారణలో హెడ్లీ సంచలన విషయాలు వెల్లడించినట్లు ఎన్ఐఏ నివేదిక ద్వారా తెలుస్తోంది.

 

తాను ఎల్ఈటీతో కలిసి పనిచేసినట్లు డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ఉగ్రదాడుల ప్రణాళికలో భాగంగా పలుమార్లు భారత్ వచ్చినట్లు చెప్పాడు. లష్కరే తోయిబాలో తాను ఆయుధాలు వాడటానికి సంబంధించి మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు తెలిపాడు. భారత్‌లో జరగబోయే ఉగ్రదాడులకు సంబంధించి ఎల్ఈటీ సభ్యులు చూపించిన మ్యాప్‌లో రాజ్‌కోట్‌లోని చమురుశుద్ధి కర్మాగారం, హైదరాబాద్‌లోని సైబరాబాద్ ఉన్నట్లు పేర్కొన్నాడు.

 

భారత్‌కు తనను పంపాలని లష్కరే తోయిబా భావించినప్పుడు హైదరాబాద్, నాగపూర్, కోల్‌కతా, పుణే, బెంగళూరు నగరాలపై చర్చ జరిగిందని చెప్పాడు. చివరకి పర్యాటకుడిగా ముంబై పంపించి, అక్కడ రెక్కీ నిర్వహించి దాడికి పాల్పడినట్లు వెల్లడించాడు.