తెలంగాణలోని పార్టీ నేతల తీరుపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు నేతలు వ్యక్తిగత ఎజెండాలతో పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇకపై ఇటువంటి ధోరణులను సహించేది లేదని, గీత దాటితే కఠిన చర్యలు తప్పవని ఆయన గట్టిగా హెచ్చరించారు.
పార్టీ కార్యాలయాన్ని కొందరు తమ వ్యక్తిగత అవసరాలకు, ప్రచారాలకు వాడుకుంటున్నారని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఆఫీసులో కేవలం పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని, పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరూ ప్రవర్తించకూడదని ఆయన సూచించారు.
ముఖ్యంగా, నేతలు ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు నిర్వహించి, వ్యక్తిగత దూషణలకు దిగడంపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకమీదట పార్టీ నాయకులు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ నిబంధన తనతో సహా పార్టీలోని ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నాయకులు హుందాగా ప్రవర్తించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
భారతీయ జనతా పార్టీ అంటే సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన బాధ్యత గల పార్టీ అని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రజలు పార్టీ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారని, అలాంటి వారికి న్యాయం జరిగేలా నేతలు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా, అనవసర వివాదాలు సృష్టిస్తూ, వ్యక్తిగత దూషణలకు పాల్పడితే పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన మరోసారి హెచ్చరించారు. నేతలందరూ సమష్టిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.