TELANGANA

ఇది సారు- కారు-60 పర్సెంట్ కమీషన్ల సర్కార్: బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కెసిఆర్ కబంధహస్తాల్లో తెలంగాణ రాష్ట్రం చిక్కుకుందని పేర్కొన్న ఆయన, కెసిఆర్ కబంధహస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్నారు.

దళిత బంధులో 30 శాతం, ఎమ్మెల్యేల నుండి మరో 30 శాతం సీఎం కుటుంబానికి మొత్తంగా 60 శాతం కమిషన్ గా వెళుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సచివాలయ నిర్మాణంతోపాటు, భూదందాలలో ఈ కమిషన్ అనివార్యమైందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు అవినీతి సర్కార్ అని బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రధాన విలన్ కెసిఆర్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. జీవో 111 రద్దు, కోకాపేట భూములు బీఆర్ఎస్ కు కేటాయింపుపై హైకోర్టుకు వెళ్తామని బండి సంజయ్ తేల్చిచెప్పారు.

ఇది సారూ.. కారు.. 60% సర్కార్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ సర్కార్ ను ఇంటికి సాగనంపే దాకా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. జీవో 111 పై కెసిఆర్ మహాకుట్ర చేశారని మండిపడ్డారు. దీనిపై లీగల్ సెల్ ద్వారా న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో బిజెపి ప్రధాన విలన్ ట్రోల్ చేస్తున్నారని, కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన విలన్ కెసిఆర్ అన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ సైడ్ విలన్ పాత్ర పోషిస్తుందని, ఆ తర్వాత పాత్ర ఎంఐఎం, సూది దబ్బడం పార్టీలు పోషిస్తున్నాయని అన్నారు. ఆయా పార్టీలను ఎదుర్కోవడానికి బిజెపి హీరో పాత్రను పోషిస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ కబంధహస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించి పేదల రాజ్యాన్ని స్థాపిస్తాం అని బండి సంజయ్ పేర్కొన్నారు.