TELANGANA

బీజేపీకి రాజా సింగ్ గుడ్ బై..? కారణం అదేనా..?

క్రమశిక్షణకు మారుపేరైన ఆ పార్టీకి కొరకరాని కొయ్య ఆ నేత. తన మాటలతోనే మంటలను రాజేస్తూ.. సొంత పార్టీ నేతలనే ఉక్కిరి బిక్కిరి చేయడం ఆయనకే చెల్లింది. ఒకసారి మేకప్‌మెన్స్‌ అంటారు. మరోసారి కుర్చీలు తుడిస్తే పదవులు వస్తాయంటారు. మరోసారి తనకు వ్యతిరేకంగా దొంగలంతా ఏకమయ్యాయంటారు. ఇక ఈసారి మాత్రం మరో అడుగు ముందుకేసి సొంత పార్టీ నేతలను ఏకంగా ట్రాన్స్‌జెండర్లతో పోల్చేశారు. ఇలా చాన్స్ దొరికిన ప్రతిసారీ బీజేపీ దుమ్ము దులుపుతున్న ఆ నేత ఎవరు? అలాంటి నేతపై ఆ పార్టీ ధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది?

 

కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్‌గా బాగా పాపులర్

 

రాజాసింగ్.. ఈ పేరుకు ఎవరికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్ బాగా పాపులర్ అయ్యారు. నిత్యం సొంత పార్టీ నేతలపై కామెంట్స్ చేస్తూ వివాదస్పద వాఖ్యలకు అడ్రస్‌గా నిలుస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇక హిందుత్వాన్ని తానే రక్షిస్తున్నాననీ, తానే హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని భుజస్కంధాలపై మోసుకుతిరుగుతున్నాననీ, రాజాసింగ్ లేకపోతే హిందుత్వమే లేదు, బీజేపీకి మనుగడే లేదు అన్నంత రేంజ్‌లో ఉంటుంది ఆయన తీరు. ఆ బుసలతోనే గతంలో మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యేదాక తెచ్చుకున్నారనీ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మహమ్మద్ ప్రవక్తపై వాఖ్యలు చేస్తే సస్పెండ్ చేసిన పార్టీ అధిష్టానం.. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ నేతలపైనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తే క్షమిస్తుందా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

 

బీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు

 

సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ రాజాసింగ్ చేస్తున్న కామెంట్లకు నేతలంతా మౌనం వహిస్తున్నారు. దొంగలంతా ఒక్కటయ్యారు అన్నా పార్టీ నేతలు ఓర్చుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారంటూ ఆరోపించారు. అయినా ఓపికతో ఉన్నారు. ఆ తర్వాత ప్యాకేజీలకు అమ్ముడుపోయే ద్రోహులు అంటూ విమర్శించారు. అయినా సహనంతో ఉన్నారు. ఇక ఆఖరికి టికెట్టు అమ్ముకునే చోరులు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సరే తమ పార్టీ నేతనే కదా అనుకున్నారు. ఇక రీసెంట్‌గా బీజేపీ, బీఆర్ఎస్ విలీనం విషయంలో కల్వకుంట్ల కవిత కామెంట్లకు మద్దతుగా నిలిచారు. సరే విషయాలు పూర్తిగా తెలియదులే అనుకున్నారు. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలను ఏకంగా ట్రాన్స్ జెండర్లతో పోల్చడంతో విషయం చాలా తీవ్రతరమైనట్టే కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీలో అగ్గి రాజేసినట్టయిందనే టాక్ వినిపిస్తుంది.

 

లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ టార్గెట్‌గా వ్యాఖ్యలు

 

రాజాసింగ్‌ బీజేపీలో చేరినప్పటి నుంచి తన వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. రాజాసింగ్ మొదటి నుంచి కూడా ఆ పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. గతంలోనూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అంశంలో, ఫ్లోర్ లీడర్ ఎంపిక అంశంలో, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అంశంలో, జిల్లాల అధ్యక్షుల ఎన్నిక అంశంలో బహిరంగంగానే హై ఓల్టేజ్‌ విమర్శలు చేస్తూ నేతలను ఏకి పారేస్తూ వస్తున్నారు.

 

లెటర్ పుణ్యమా అని కమలం పార్టీలో ముసలం

 

తాజాగా కల్వకుంట్ల డాడీ డాటర్ లెటర్ ఎపిసోడ్‌లో బీజేపీ బలయ్యిందనే టాక్ వినిపిస్తోంది. లెటర్ల సంభాషణలతో డాడి డాటర్ బెటర్‌గానే ఉన్నారు. కానీ ఈ లెటర్‌ పుణ్యమా అని కమలం పార్టీలో మాత్రం ముసలం మొదలైంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అంటూ కవిత చేసిన ఆరోపణలకు రాజాసింగ్ మద్దతు పలకడం ఇప్పుడు ఆ పార్టీలో సంచలనంగా మారింది. అంతేకాదు మంచి ప్యాకేజీలు దొరికితే మా పార్టీ వాళ్లు బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారంటూ రాజాసింగ్ చేసిన విమర్శలకు నేతలంతా సందిగ్ధంలో పడ్డట్టుగా తెలుస్తోంది. రాజాసింగ్ చేస్తున్న విమర్శలు పార్టీ నేతలు అసహనాలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజాసింగ్ పార్టీలో ఉంటారా? లేదా?

 

రాజాసింగ్ చేస్తున్న ఆరోపణలన్నీ ప్రతీది పూస గుచ్చినట్లు అధిష్టానం దృష్టికి రాష్ట్ర నేతలు తీసుకెళ్తున్నారనే టాక్ ఉంది. అందులో భాగంగానే క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అధిష్టాన పెద్దలు సిద్ధమవుతున్నారనే చర్చ జోరుగానే జరుగుతోంది. అయితే రాజాసింగ్ చేస్తున్న సంచలన ఆరోపణలు, విమర్శలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా? లేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు రాజాసింగ్‌కు నోటీసులు ఇచ్చే ధైర్యం చేస్తుందా..? అనేది కూడా చూడాల్సి ఉంది. ఒక వేళ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే రాజాసింగ్ పార్టీలో ఉంటారా? లేదా? అనే దానిపై కూడా సస్పెన్స్‌ కొనసాగుతోంది.

 

తనపై చర్యలు కాదు.. పూర్తిగా సస్పెండ్ చేయాలని సవాల్

 

రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలoటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో మరోసారి రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీకి దమ్ముంటే తనపై చర్యలు కాదు.. పూర్తిగా సస్పెండ్ చేయాలనీ సవాల్ విసిరారు. అంతే కాదు క్రమశిక్షణ నోటీసులు జారీ చేసినా.. సస్పెండ్ చేసినా పార్టీ నేతల జాతకం అంతా ప్రజల ముందు ఉంచి వెళ్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. భయపడేది లేదంటూనే.. ట్రాన్స్‌జెండర్‌ లాంటి నేతల ఉంటూ పార్టీని ముందుకు నడిపించలేమని వ్యాఖ్యానించారు.

 

కవిత వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తూ మౌనం వహిస్తారా?

 

అలాంటి వారితో కలిసి హిందూ ధర్మ కార్యక్రమాలను నిర్మించలేమన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరింత రచ్చను లేపాయి. మొత్తం మీద సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్న రాజాసింగ్‌పై పార్టీ నాయకత్వం చర్యలు చేపడుతుందా..? లేక రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యలతో పాటు, బీజేపీలో బీఆర్ఎస్‌లో విలీనం అంటూ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తూ జాతీయ పెద్దలు, రాష్ట్ర నేతలు మౌనం వహిస్తారా అనేది చూడాలి.