కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటెల రాజేందర్ ఏం చెప్పారు? మాజీ సీఎం కేసీఆర్ ఇరుక్కున్నట్టేనా? మీడియా ముందు ఆయన మాటలు దేనికి సంకేతాలు? కేవలం ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై మాత్రమే ఆయన్ని ప్రశ్నించిందా? దాదాపు 45 నిమిషాల సేపు 19 ప్రశ్నలు సంధించిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు ఎంపీ ఈటెల రాజందర్ హాజరయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బీఆర్కేభవన్లో కమిషన్ ముందు హాజరయ్యారు. దాదాపు 45 నిమిషాల సేపు కమిషన్ ఆయన్ని విచారించింది. ప్రాజెక్టుకు అవసరమైన 19 ప్రశ్నలు లేవనెత్తినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ ఆదేశాలతోనే నిధులు విడుదల చేసినట్లు తెలిపారట ఈటల.
ముఖ్యంగా కేబినెట్ నిర్ణయాల మేరకు నిధుల విడుదల జరిగిందని తెలిపారు. నిధులు విడుదల విషయంలో తాను సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదని కమిషన్‌కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కొన్ని సాంకేతిక అంశాల గురించి తనకు తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం.
విచారణ తర్వాత మీడియా ముందుకొచ్చి కీలక విషయాలు బయటపెట్టారు ఈటెల. రెండున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో తాను విలువలతో వ్యవహరించానని తెలిపారు. రెండున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో తాను విలువలతో వ్యవహరించానని తెలిపారు.
2005 ఆనాటి ప్రభుత్వం జలయజ్షంలో భాగంగా తుమ్మిడి హట్టి, చేవెళ్ల ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. దాని విలువ 16,00 కోట్ల రూపాయలని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత అదే ప్రాజెక్టు 38 వేల కోట్లకు పెంచారన్నారు. తుమ్మిడి హట్టి ప్రాజెక్టుపై ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్నారు.
ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన నీటి అవసరాలు తీర్చలేవని సీడబ్ల్యూసీ, ఇరిగేషన్ విభాగం నివేదికలు ప్రభుత్వానికి ఇచ్చాయన్నారు. వెంటనే ఆనాటి సీఎం కేసీఆర్.. హరీష్‌రావు ఆధ్వర్యంలో మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారన్నారు. సీడబ్ల్యూసీ, ఇరిగేషన్ విభాగం నివేదికలపై చర్చించామన్నారు.
అవసరాలను తుమ్మిడి హట్టి, చేవెళ్ల ప్రాజెక్టుల తీర్చకపోతే రకరకాలుగా సర్వేలు చేసిన తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టు ప్రపోజల్ చేసినట్టు తెలిపారు. ఆనాడు ప్రాజెక్టు విలువ రూ. 63 వేల కోట్లుగా అంచనా వేశారు. అనేక జిల్లాల్లో వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో రూ.82 వేల కోట్లకు చేరిందన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలీదని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు డిజైన్లు, నిర్మాణాలు, టెక్నికల్ వాటితో ఏమైనా సంబంధం ఉందా అని కమిషన్ ప్రశ్నించిందని అన్నారు. వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్‌పై రుణాలపై ఏమైనా అధికారం ఉందా అని నిలదీసిందన్నారు. ప్రాజెక్టు ఖర్చుకు తమకు ఎలాంటి సంబంధంలేదన్నారు.
నిధుల విషయంలో ప్రతీది చెక్ చేసుకోవాల్సింది ఇరిగేషన్ శాఖకు చెందిన అకౌంట్ విభాగమన్నారు. గత మీడియా సమావేశాల్లో తాను మాట్లాడిన మాటలను ఈటెల సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన ప్రభుత్వం తీసుకుందన్నారు. టెక్నికల్ కమిటీ తుమ్మిడి హట్టి ప్రాజెక్టు కట్టవద్దని చెప్పిందన్నారు. దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. కేబినెట్ ఆమోదిస్తేనే ప్రాజెక్టు అమలవుతుందన్నారు.