తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని సీఎం రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
‘కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథం వైపు వెళ్తుందని సీఎం అన్నారు. ‘సాయుధ రైతాంగ, రజాకార్ వ్యతిరేక పోరాటాల గడ్డ నల్గొండ జిల్లా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రాజెక్ట్ లు మాత్రమే ఇప్పుడు రైతులను ఆదుకుంటున్నాయి. మూడు అడుగుల జగదీష్ రెడ్డికి చెబుతున్నా. గోదావరి జలాలు తేవడం అంటే గ్లాస్ లో సోడా కలిపినంత ఈజీ కాదు. కార్యక్రమాన్ని అడ్డుకుంటా అని ప్రగల్బాలు పలుకుతున్నావు. తుంగతుర్తి గడ్డ మీద నీకు సవాల్ విసురుతున్నా.. మా దామన్న ఒక్కడు చాలు నీ కథ ఏందో చూడడానికి. పదేళ్ల తర్వాత పేదలకు సన్నబియ్యం ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు.
‘రుణమాపీ కోసం రూ.21వేల కోట్లు ఖర్చుచేసి రైతుల ఖాతాలో జమచేశాం. రైతు భరోసా ఇచ్చి రైతుల రుణం తీర్చుకున్నాం. 9 రోజుల్లో 1కోటి 48లక్షల ఎకరాలకు 9 వేల కోట్లు రైతు భరోసా ఇచ్చాం. 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలో మొదటి స్థానంలో ఉన్నాం. రైతులు ఆనందంగా ఉంటేనే ఇందిరమ్మ ఆత్మ సంతోషంగా ఉంటుంది. 5 లక్షల కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నాం. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణకు ఇప్పుడు సార్ధకత ఏర్పడింది. స్వయం సహాయక సంఘాల మహిళలకు రెండు చీరలు ఇస్తున్నాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం ఈ రేవంతన్న మీకు ఇస్తున్న గౌరవం ఇది’ అని చెప్పారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ లు మహిళలకి అందిస్తున్నాం. ప్రభుత్వ స్థలాల్లో పెట్రోల్ బంక్ లు నిర్మించి కోటేశ్వరులను చేస్తున్నాం. ఆదానీ, అంబానీలకు పోటీగా వ్యాపారాల్లోమహిళలకు అవకాశం కల్పించినం. పోలీస్ శాఖలో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినం. రెండున్నర ఏళ్లలో నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం. లక్ష కోట్ల కాళేశ్వరం మూడేళ్లలో కూళేశ్వరం అయ్యింది. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ తో సహా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. భూనాదిగాని కాలువ ద్వారా గోదావరి నీళ్లు తుంగతుర్తికి తెచ్చి తీరుతాం. 60వేల మెజార్టీతో సామెల్ ను గెలిపించారు’ అని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క గంజాయి మొక్క కూడా మొలవకూడదు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ గంజాయి మొక్క ఉంది అది పీకేసే బాధ్యత మీరే తీసుకోవాలి. 2024 నుండి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. బీఆర్ఎస్ నేతలంతా కట్టకట్టుకుని రండి.. మీరంతా ఒకవైపు.. మా కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవైపు ఉంటారు. దేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. నరేంద్ర మోదీ మెడలు వంచి దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది. కుల గణన, జనణన, 42% బీసీల రిజర్వేషన్ ఇచ్చి మన పరిపాలన కొనసాగుతుంది. ఆడబిడ్డలకోసం ఈ ప్రజా ప్రభుత్వం ఎల్లపుడు పనిచేస్తుంది’ అని సీఎం వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇవ్వాలన్నా.. సన్న బియ్యం పంపిణీ చేయాలన్నా.. ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం అవుతోంది. రైతులు పండించిన వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాకుండా రూ.500 బోనస్ ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.2 లక్షల రుణమాఫీ ద్వారా 2,55,968 మంది రైతులకు రూ.21 వేల కోట్ల మేర రుణ విముక్తి కల్పించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.