TELANGANA

కేసీఆర్ కుటుంబంపై కోర్టులకు వెళతాం: తీన్మార్ మల్లన్న..

బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం వల్లే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడిందని… లేకపోతే ఆ అరాచకం ఇప్పటికీ కొనసాగేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. కేసీఆర్ తో పాటు ఈ దారుణానికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్ పిలుపుతో తీన్మార్ మల్లన్న ఈరోజు విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా మల్లన్న స్టేట్మెంట్ ను సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు.

 

విచారణ అనంతరం మీడియాతో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం తనతో పాటు పలువురి ఫోన్లను ట్యాప్ చేసిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు అందించానని… తన వద్ద మరికొంత సమాచారం ఉందని, అది త్వరలోనే అధికారులకు పంపిస్తానని చెప్పారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని అధికారులు చెప్పారని తెలిపారు.

 

వ్యక్తిగత హక్కులను హరించిన కేసీఆర్ కుటుంబంపై, అప్పటి అధికారులపై చర్యల కోసం కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడేనని… ఈ ప్రభుత్వంలో అలాంటి దుర్మార్గాలు జరగవనే సంకేతాలను ప్రజలకు ముఖ్యమంత్రి ఇవ్వాలన్నారు. ఈ కేసులో సిట్ ఏ మేరకు న్యాయం చేయగలదో చూస్తామన్నారు.