APTELANGANA

వైసీపీలోకి ముద్రగడ చేరిక లాంఛనమేనా ? కాకినాడ ఎంపీగా పోటీపై చర్చలు !

కాపు ఉద్యమాలతో తెరపైకి వచ్చిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గత టీడీపీ ప్రభుత్వంలో తుని రైలు దహనం ఘటనతో చర్చల్లోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేయడంతో విపక్ష వైసీపీని ఆశ్రయించి మద్దతు పొందారు.

ఇది కాస్తా ఎన్నికల్లో సైతం వైసీపీకి అనుకూలంగా పనిచేసింది. దీంతో గోదావరి జిల్లాల్లో వైసీపీ మెజారిటీ సీట్లను గెల్చుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మౌనంగా ఉంటున్న ముద్రగడ తాజాగా కీలక ప్రకటన చేశారు.

త్వరలో తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తానని తాజాగా వెల్లడించిన ముద్రగడ పద్మనాభం ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఓసారి గోదావరి జిల్లాల వైసీపీ ఇన్ ఛార్జ్ ఎంపీ మిధున్ రెడ్డితో చర్చించిన ముద్రగడ, ఇప్పుడు కాకినాడ ఎంపీ వంగా గీతతో పాటు మరికొందరు వైసీపీ నేతలను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. దీంతో త్వరలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లిన వైసీపీ నేతలు.. ఆయనకు వచ్చే ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటును ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన కాదంటే ఆయన కుమారుడికి ఈ సీటు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పినట్లు తెలుస్తోంది. ఎంపీ సీటు వద్దంటే కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు కూడా సిద్ధమని వైసీపీ నేతలు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముద్రగడ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది.

మరోవైపు ముద్రగడను ఎన్నికల నాటికి వైసీపీలోకి తీసుకురాగలిగితే టీడీపీ-జనసేన కూటమిని భారీగా దెబ్బతీయొచ్చన్న అంచనా అధికార పార్టీలో కనిపిస్తోంది. ముఖ్యంగా కాపు నేతగా ముద్రగడకు ఉన్న పేరు నేపథ్యంలో ఎన్నికల్లో ఆయన్ను తమ పార్టీ తరఫున బరిలోకి దింపితే ఆ ప్రభావం రెండు ఉమ్మడి గోదావరి జిల్లాలపైనా ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. పవన్ తో పోలిస్తే గోదావరి జిల్లాల్లో ముద్రగడకు ఉన్న విశ్వసనీయత ఎక్కువని వారు చెప్తున్నారు.