TELANGANA

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు..

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బాలరాజుకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గువ్వలతో పాటు ఆయన అనుచరులు, నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా బీజేపీ సభ్యత్వం స్వీకరించారు.

 

కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరతారనే దానిపై తీవ్రమైన చర్చ నడిచింది. గతంలో తనపై దాడి జరిగినప్పుడు పార్టీ నాయకత్వం అండగా నిలవలేదని, తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన బీఆర్ఎస్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడగా, తాజాగా బీజేపీలో చేరడంతో ఊహాగానాలకు తెరపడింది.

 

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, దేశవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి గువ్వల బాలరాజు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆయన సేవలను పూర్తిగా వినియోగించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు ఇతర సీనియర్ నాయకులు పాల్గొని గువ్వల బాలరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.