TELANGANA

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాల పెంపు,

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు… ఉద్యోగుల జీతాలతో పాటు సంక్షేమం విషయంపై కూడా దృష్టిపెట్టింది.

ఇందులో భాగంగా… మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలను ఈ నెల నుంచే అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 54,201 మంది కుక్‌ కమ్‌ హెల్పర్లకు లబ్ధి చేకూరనుంది.

హైదరాబాద్‌లో శనివారం జరిగిన జిల్లా విద్యాశాఖ అధికారుల సమావేశంలో మంత్రి సబితా మాట్లాడారు. కార్మికులకు గౌరవ వేతనం కింద రూ.వెయ్యి ఇస్తుండగా సీఎం కేసీఆర్‌ దాన్ని రూ.3 వేలకు పెంచుతామని గతంలో ప్రకటన చేశారని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా ఈ నెల నుంచే పెంచిన జీతాలను అందజేస్తామని పేర్కొన్నారు. పెంచిన వేతనాల వల్ల ఏడాదికి రూ.108 .40 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని మంత్రి వెల్లడించారు.ఇక ఈ పథకానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని, పర్యవేక్షణ పెంచాలని దిశానిర్దేశం చేశారు.

ఇక పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలను గుర్తించేందుకు ఇకనుంచి ఏటా రాష్ట్ర స్థాయి సాధన సర్వేనిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ఆ సర్వే ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే 1-5 తరగతుల విద్యార్థుల్లో భాషా, గణిత సామర్థ్యాలను పెంచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.

మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న కార్మికుల వేతనాలకు సంబంధించి 2022లోనే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. వారి జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. అప్పట్నుంచి పెరిగిన జీతాలు కాకుండా.. పాత జీతాలనే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే.. ఈ నెల నుంచి వారికి పెరిగిన జీతాలను ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు.